'భారతమాతకు వెన్నుపోటు పొడిచారు'
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి దర్యాప్తు మిషతో పాకిస్థాన్ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్(జిట్)ను భారత్ లోకి అనుమతించడాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తోన్న ఆమ్ ఆద్మీ పార్టీ తన స్వరాన్ని తీవ్రతరం చేసింది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పఠాన్ కోట్ విషయంలో మోదీ సర్కార్ తీరును తూర్పారబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు కలిసి భారతమాతకు వెన్నుపోటు పొడిచారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
'ఇది సిగ్గుచేటు. ప్రధాని మోదీ పాకిస్థాన్ ముందు దేశాన్ని అవమానపర్చారు. ఇంతకు ముందున్న ప్రధానులెవ్వరూ ఇలా చెయ్యలేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ఓ వైపు భారత్ మాతాకీ జై కొట్టాలని నినదిస్తున్నారు. కానీ వాళ్లే భారత మాతకు వెన్నుపోటు పొడుస్తున్నారు' అంటూ తన ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు కేజ్రీవాల్. జిట్ నివేదిక బటికి రాకముందే అందులో ఏముందో పాకిస్థాన్ మీడియా వెల్లడించడం, పఠాన్ కోట్ దాడికి పాల్పడింది పాక్ కాదు ఇండియానే అనే ప్రేలాపనలు పేలడం లాంటి పరిణామాలు మోదీ అసమర్థత వల్ల కలిగినవేనని విమర్శించారు.