కాశ్మీర్ లో ప్రభుత్వం మాదే, ఓమర్ తప్పుకో!
జమ్మూ: రాబోయే ఎన్నికల తర్వాత జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం మాదే అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లాను తప్పుకోవాలంటూ అమిత్ షా హెచ్చరించారు.
జమ్మూ, కాశ్మీర్ అసెంబ్లీలోని 44 సీట్ల గెలుపు కోసం ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికే ఇక్కడకు వచ్చాను. మేము తప్పక విజయం సాధిస్తాం అని జమ్మూ నగరానికి 90 కిలోమీటర్ల దూరంలోని కతువా పట్టణంలో నిర్వహించిన సభలో అమిత్ వ్యాఖ్యలు చేశారు.
జమ్మూ,కాశ్మీర్ లో ఏర్పడబోయే ప్రభుత్వం మాదే అంటూ అభిమానుల కేరింతల మధ్య అమిత్ షా అన్నారు. కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్ కు ధీటైన జవాబివ్వాలని ప్రధాని నరేంద్రమోడీ ఎదురు చూస్తున్నారని అమిత్ షా తెలిపారు.