
ఫైల్‌ఫోటో
న్యూయార్క్ : వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికార పగ్గాలు చేపడుతుందని, దేశంలో మిగిలిన అవినీతి మరకలను రెండో విడత పాలనలో తొలగిస్తుందని పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. కొలంబియా బిజినెస్ స్కూల్‌లో జరిగిన 14వ వార్షిక భారత వాణిజ్య సదస్సులో పాల్గొనేందుకు స్వామి అమెరికా పర్యటనలో ఉన్నారు. 2019లోనూ తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
పాలనలో సమర్థనేతగా మోదీకి ఉన్న ప్రతిష్టతో పాటు అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటం తమకు సానుకూల అంశాలని వివరించారు. హిందువుల్లో కులాలకు అతీతంగా బీజేపీకి ఓటు వేయాలన్న ఆకాంక్ష పెరిగిందని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో తాము నిర్మూలించని అవినీతి ఏమైనా ఉంటే దాన్ని తొలగిస్తామని చెబుతూ 2019 ఎన్నికల్లో ప్రజల ముందుకెళతామన్నారు. పటిష్ట, ఐక్య భారత్ నిర్మాణమే తమ లక్ష్యమని, బీజేపీ మైనారిటీలకు వ్యతిరేకం కాదని సుబ్రహ్మణ్య స్వామి స్పష్టం చేశారు. విద్యార్ధులు, విద్యా వేత్తలు, పారిశ్రామికవేత్తలు, అధికారులు హాజరైన ఈ సదస్సును ఉద్దేశించి స్వామి పలు అంశాలపై ప్రసంగించారు.