అత్యాచారాలపై ఆగ్రహం
* సీఎం ఇంటిని ముట్టడించేందుకు బీజేపీ మహిళా మోర్చా యత్నం
* అడ్డుకున్న పోలీసులు
* ఎంపీ శోభాకరంద్లాజేతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలపై మహిళల ఆగ్రహం మిన్నంటింది. అత్యాచారాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బుధవారమిక్కడ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగానే వందలాది సంఖ్యలో తరలివచ్చిన మహిళా కార్యకర్తలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో మహిళా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు, మహిళా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నివాసం ఎదుట ఏర్పాటు చేసిన బారికేడ్‌లను తోసేస్తూ ఆందోళనకారులు ముందుకు దూసుకెళ్లడంతో తీవ్ర ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో ఆందోళనకారుల్లో ఉన్న పార్లమెంటు సభ్యురాలు శోభా కరంద్లాజేతో సైతం పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో బీజేపీ కార్యకర్తలు మరింతగా రగిలిపోయారు.
రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎంపీ శోభాకరంద్లాజేతో పాటు బీజేపీ నేతలు మాళవిక, తారా అనూరాధలతో పాటు దాదాపు 50 మంది మహిళా మోర్చా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాసేపటికి ఆందోళనకారులను పోలీసులు వదిలిపెట్టారు. ప్రభుత్వ నిరంకుశ ధోరణికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ అని బీజేపీ నేతలు విమర్శించారు. సమస్యలపై ప్రజల పక్షాన పోరాటానికి దిగిన వారిపై పోలీసులను ప్రయోగించడం నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.
అనంతరం రోడ్డు పైనే బైఠాయించిన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు తక్షణమే నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి ఘటనా స్థలానికి రావాలంటూ పట్టుబట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ధర్నా జరుగుతున్న ప్రాంతానికి నగర పోలీస్ కమీషనర్ ఎంఎన్ రెడ్డి చేరుకొని ఆందోళన కారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. శోభాకరంద్లాజే పై దురుసుగా ప్రవర్తించిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇవ్వడంతో ఆందోళన కారులు శాంతించారు. కార్యక్రమంలో మాజీ సీఎం యడ్యూరప్ప, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి తదితరులు పాల్గొన్నారు.