city police commissioner
-
కొత్వాల్ సాబ్ జర దేఖో!
నగరవాసికి ట్రాఫిక్ నరకం చూపిస్తోంది. ఎక్కడపడితే అక్కడ ఉల్లంఘనలు, ఎప్పుడుపడితే అప్పుడు ట్రాఫిక్‌జాంలు తప్పట్లేదు. వాహనాలను నియంత్రించాల్సిన ట్రాఫిక్ విభాగం సిబ్బంది కెమెరాలు, ట్యాబ్‌లు చేతపట్టి ఈ–చలాన్లకే పరిమితమవుతున్నారు. చౌరస్తాలతో పాటు కొన్ని ప్రాంతాల్లోనే ఉంటూ ఈ డ్రైవ్స్ చేస్తున్నారు. దీంతో మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడిక్కడ ఉల్లంఘనులు రెచ్చిపోతున్నారు. రహదారులపై దూసుకుపోతున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనల్ని ప్రధానంగా మూడు కేటగిరీలుగా విభజిస్తారు. వాహనం నడిపే వ్యక్తికి ముప్పు కలిగించేవి, ఎదుటి వారికి ముప్పుగా మారేవి, వాహన చోదకుడితో పాటు ఎదుటి వ్యక్తికీ ముప్పును తెచి్చపెట్టేవి. ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్.. ఇలా ఇవన్నీ మూడో కేటగిరీ కిందికి వస్తాయి. రాజధానిలో మూడో కేటగిరీకి చెందిన ఉల్లంఘనలే ఎక్కువగా ఉంటున్నాయి. రెండోసారి సిటీ కొత్వాల్‌గా వచ్చిన సీవీ ఆనంద్‌కు ట్రాఫిక్ విభాగంపై మంచి పట్టుంది. గతంలో సుదీర్ఘకాలం సిటీ ట్రాఫిక్ చీఫ్‌గా వ్యవహరించారు. అప్పట్లో ఆయన వేసుకున్న మార్కు ఇప్పటికీ పదిలమే. సైబరాబాద్, హైదరాబాద్ సీపీలుగా పని చేసినప్పుడూ అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ట్రాఫిక్‌పై సీపీ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నగర వాసులు కోరుతున్నారు. -
ఎస్ఐ.. మై హీరో ఆఫ్ ది డే
సాక్షి, హైదరాబాద్ : ప్రయాణికులుగా ఆటోలో ఎక్కి ఆటోడ్రైవర్‌పై దాడి చేసి దోపిడీకి పాల్పడిన ముగ్గురు దొంగలను గంటల వ్యవధిలోనే అరెస్టు చేసిన బేగంపేట సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ ఉపేందర్యాదవ్ను నగర పోలీసు కమిషనర్ ప్రశంసించారు. బేగంపేట మయూరిమార్గ్ వద్ద ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఓలాకు చెందిన ఓ ఆటోలో ఎక్కిన ముగ్గురు వ్యక్తులు ఆటోడ్రైవర్‌పై దాడి చేసి ఆటో అద్దాలు పగులగొట్టడమే కాకుండా అతని వద్ద ఉన్న రూ.5 వేలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితుడు వెంటనే 100కు డయల్ చేసి పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చాడు. రాత్రి విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ ఉపేందర్‌యాదవ్ పోలీసు కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం అందుకుని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను సేకరించి అప్పటికప్పుడు స్థానికంగా పలువురితో ఏర్పాటుచేసిన గ్రూపులో పోస్టు చేశారు. స్పందించిన స్థానికులు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో నిందితులను చూశామని చెప్పడంతో ఎస్ఐ ఉపేందర్‌యాదవ్ వెళ్ళి విచారించారు. స్థానికంగా రవికిరణ్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు బల్కంపేటలో ఉండే ఇద్దరిని, ఫతేనగర్‌లో ఉండే మరొకరిని పట్టుకున్నారు. దోపిడీకి పాల్పడిన నిందితులను స్వల్ప వ్యవధిలోనే ఎస్ఐ ఉపేందర్‌యాదవ్ పట్టుకోవడంతో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ‘మై హీరో ఆఫ్ ది డే’ అంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. -
విదేశీ ముఠాల హస్తాన్ని తోసిపుచ్చలేం : పోలీస్ కమిషనర్
సాక్షి, విశాఖపట్టణం : సిటీలో దొంగ నోట్ల ముద్రణ, చెలామణీ రాకెట్‌ను పోలీసులు ఆదివారం ఛేదించారు. ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేల నోట్లు, వంద రూపాయల నోట్లు చెలామణీ చేస్తుండగా ఓ రియల్ఎస్టేట్ వ్యాపారిని పట్టుకొని అతని వద్దనుంచి సుమారు 3 లక్షల రూపాయల దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నోట్లను పరిశీలించిన పోలీసులు వాటిని పకడ్బందీగా ముద్రించినట్టు నిర్థారించారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు ఎన్.ఐ.ఏ సహాయం తీసుకోవాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. విదేశీ ముఠా హస్తం ఉండే అవకాశముందంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సిటీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా స్పందిస్తూ.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ఫేక్ కరెన్సీ అక్రమ రవాణాను తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించారు. నోట్ల పంపిణీ ముఠాను అరెస్ట్ చేస్తే పూర్తి ఆధారాలు లభిస్తాయని వెల్లడించారు. -
ఒక్క ఫోన్ కాల్.. నిమిషాలలో మీ వద్దకు..
సాక్షి, హైదరాబాద్ : ఎవరైనా ఆపదలో ఉన్నామని భావిస్తే, వెంటనే పోలీసుల సాయం తీసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసిన ఆయన.. ఏ క్షణంలో అయినా అభద్రతా భావం కలిగితే డయల్ 100ను సంప్రదించాలని కోరారు. పోలీస్ పెట్రోలింగ్ వెహికల్ సమాచారం అందుకున్న 6 నుంచి 8 నిమిషాల్లోనే మీ ముందుకు వస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో 122 పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతూ ఉంటాయని తెలిపారు. వెంటనే సాయం చేసేందుకు మీ ముందుకు వస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటారని ఆయన తెలిపారు. Dial 100 the moment you feel and threat or scare anytime anywhere. Police patrol car will reach you in 6 to 8 minutes, Hyderabad city police has 122 patrol cars for your immediate help. We are with you always. pic.twitter.com/xmJTHt1w5u — Anjani Kumar, IPS (@CPHydCity) November 29, 2019 -
‘వావ్’ హైదరాబాద్!
భరోసా, షీ–టీమ్స్ ఏర్పాటుతో ఇప్పటికే మహిళల భద్రతలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్న సిటీ పోలీసు విభాగం మరో అడుగు ముందుకు వేసింది. గస్తీలో మహిళా సిబ్బందికి ప్రాధాన్యం కల్పిస్తూ ‘ఉమెన్ ఆన్ వీల్స్’(వావ్) పేరుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. దేశంలోనే తొలిసారిగా కంబాట్ సిస్టమ్‌లో శిక్షణ తీసుకుని రంగంలోకి దిగుతున్న ఈ టీమ్స్‌ను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ఇక్కడ గోషామహల్ పోలీసుస్టేడియంలో ఆవిష్కరించారు. తొలిదశలో డివిజన్‌కు ఒకటి చొప్పున కేటాయించారు. త్వరలో ప్రతిఠాణాకు ఒక బృందం ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ టీమ్స్ పోలీసు ఉన్నతాధికారుల ఎదుట ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ డెమో ఇచ్చాయి. సుశిక్షితులైన ఈ 43 మందితో 20 వావ్ టీమ్స్ ఏర్పాటు చేశారు. వీరు బ్లూకోల్ట్స్లో అంతర్భాగంగా ఒక్కో ద్విచక్రవాహనంపై ఇద్దరు చొప్పున గస్తీ తిరుగుతూ ఉంటారు.తొలిదశలో నగరంలోని 17 డివిజన్లకూ ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. మరో మూడింటిని ప్రత్యేక సందర్భాలు, పర్యాటక ప్రాంతాల్లో వినియోగిస్తారు. భవిష్యత్తులో ప్రతి పోలీసుస్టేషన్‌కు ఒక వావ్ టీమ్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సాధారణ గస్తీతోపాటు డయల్–100కు వచ్చే కాల్స్ ఆధారంగానూ ఈ టీమ్స్ పనిచేస్తుంటాయి. నేరాలు నిరోధించడం, సమాచారం సేకరించడంతో పాటు ఎమర్జెన్సీ రెస్పాన్స్ బాధ్యతల్నీ నిర్వర్తించనున్నాయి. ప్రత్యేక లోగోతో కూడిన ద్విచక్ర వాహనంపై సంచరించే బ్లూకోల్ట్స్ యూనిఫామ్‌తోపాటు వారికి కమ్యూనికేషన్ పరికరాలు, ప్లాస్టిక్ లాఠీ తదితరాలూ అందించారు. రెండు నెలల కఠోర శిక్షణ... ఇప్పటివరకు నగరంలో కేవలం పురుష పోలీసులు మాత్రమే బ్లూకోల్ట్స్ పేరుతో గస్తీ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, మహిళా పోలీసులకూ అన్ని రకాలైన విధుల్లోనూ భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించిన సిటీ పోలీసు కమిషనర్ ‘వావ్’బృందాలకు అంకురార్పణ చేశారు. గత ఏడాది కానిస్టేబుళ్లుగా ఎంపికై, ఇటీవలే శిక్షణ పూర్తిచేసుకుని వచ్చిన యువ మహిళా కానిస్టేబుళ్ల నుంచి అవసరమైన అర్హతలు ఉన్న 43 మందిని ఎంపిక చేశారు. వీరికి రెండు నెలలపాటు కఠోర శిక్షణ ఇచ్చారు. ఇందులో ఎలాంటి ఆయుధం లేకుండా అసాంఘిక శక్తుల్ని ఎదుర్కోవడం నుంచి ఉగ్రవాదులతోనూ పోరాడే పాటవాలను నేర్పించారు. ఏడీబీ టూల్స్, టీడీ 9 కాంబోస్ వంటి అత్యాధునిక శిక్షణలు ఇచ్చారు. మహిళా పోలీసులకు ఈ తరహా శిక్షణలు ఇవ్వడం ఇదే తొలిసారి. పురుషులతో సమానంగా ఎదిగేలా.. మహిళాపోలీసులకు ఇదో మైలురాయి. పోలీసు విభాగంలోని మహిళాసిబ్బంది పురుష సిబ్బందితో సమానంగా ఎదిగేలా అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే ఉమెన్ ఆన్ వీల్స్ బృందాలను ఏర్పాటు చేశాం. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగిన ‘వీ కెన్’అనే కార్యక్రమంలో పోలీసు విభాగంలో ఉత్తమ సేవలు అందించిన 63 మంది మహిళల్ని సన్మానించుకున్నాం. అప్పుడే మహిళా పోలీసుల్నీ అన్ని రకాలైన విధుల్లోనూ వినియోగించుకోవాలని, ఆ దిశలో చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఈ టీమ్స్ అందుబాటులోకి వచ్చాయి. – షికా గోయల్, అదనపు సీపీ ప్రతి మహిళా టెక్నిక్స్ నేర్చుకోవాలి ఈ బృందాల ఏర్పాటు మహిళా సాధికారతలో కీలక పరిణామం.ఈ ‘ఉమెన్ ఆన్ వీల్స్’బృందాలు మనందరికీ సేవ చేస్తాయి. ప్రతి మహిళా కొన్ని కాంబాక్ట్ టెక్నిక్స్ నేర్చుకోవాల్సిందే. నిత్యజీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి వాటిని వాడాలి. సమాజంలో తిరగాల్సి వచ్చినప్పుడు ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా వెళ్లడానికి ఇవి ఎంతో ఉపయుక్తం. – మెహరీన్ కౌర్,హీరోయిన్ సిటీ రోల్ మోడల్‌గా మారింది ‘భరోసా, షీ టీమ్స్తోపాటు మహిళల భద్రత కోసం తీసుకున్న అనేక చర్యలతో హైదరాబాద్ ఇతర నగరాలకు, రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా మారింది. ప్రతివారం ఎవరో ఒకరు వచ్చి అధ్యయనం చేసి వెళ్తున్నారు. ఉమెన్ ఆన్ వీల్స్ బృందాల ఏర్పాటుతో మరో రికార్డు సొంతం చేసుకుంది. రాష్ట్రంలో గడిచిన మూడేళ్లుగా మహిళల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. పోలీసు రిక్రూట్మెంట్ లోనూ వీరి కోసం స్పెషల్‌డ్రైవ్స్ చేపడుతున్నాం. పోలీసింగ్ అంటే రఫ్ అండ్ టఫ్ ఉద్యోగమని, మహిళలు ఈ విధులు నిర్వర్తించలేరనే అభిప్రాయం ఈ బృందాల ఏర్పాటుతో పోతుంది. సమాజంలో సగం ఉండటమే కాదు పోలీసుస్టేషన్‌కు వచ్చేవారిలోనూ మహిళాబాధితులు ఎక్కువే. వీరి భద్రతకు కీలకప్రాధాన్యం ఇస్తున్నాం. ఎవరైనా ఎక్కడైనా తప్పు జరుగుతున్నట్లు గమనిస్తే కనీసం ముగ్గురికి చెప్పండి... లేదా 100కు ఫోన్ చేయండి’ – అంజనీకుమార్, కొత్వాల్ – సాక్షి, హైదరాబాద్ -
చిన్నారి.. చేతన
సాక్షి, హైదరాబాద్: సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి నుంచి కిడ్నాపైన తన బిడ్డను తిరిగి తన ఒడికి చేర్చడంలో కీలకపాత్ర పోషించిన ఏసీపీ చేతన పేరునే ఆ చిన్నారికి పెడుతున్నట్లు తల్లి సబావత్ విజయ ప్రకటించారు. తమకు దైర్యం చెప్పడానికి ఆస్పత్రికి వచ్చిన నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు ఈ విషయం తెలిపారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ చిన్నారిని సైతం చేతన లాంటి అధికారిగా చేయాలని విజయ నుంచి మాట తీసుకున్నారు. బాలికల విద్యాశాతాన్ని పెంచడానికి ఇదో ఉత్తమ కేస్‌స్టడీగా మారాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం ఆస్పత్రికి వెళ్లిన అంజనీకుమార్ శిశువు తల్లికి పుష్పగుచ్ఛం అందించారు. బీదర్‌కు చెందిన మహిళగానే అనుమానం... చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ బీదర్‌వాసి అని పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువును తీసుకొని ఎంజీబీఎస్ నుంచి బస్సులో వెళ్లిన ఆమె బీదర్ బస్టాండ్‌లో కాకుండా కాస్త ముందున్న నయాకమాన్ స్టాప్‌లో దిగింది. ఇలా కేవలం స్థానికులు మాత్రమే చేస్తారనే ఉద్దేశంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు. సోమవారం సైతం విజయ బిడ్డ కంటే ముందు మరో ఇద్దరు చిన్నారుల్ని ఎత్తుకు వెళ్లడానికి ప్రయత్నించి విఫలమైనట్లు బయటపడింది. మీడియాలో హడావుడి, పోలీసుల గాలింపు నేపథ్యంలో భయపడిపోయి బుధవారం సాయంత్రం బీదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువును వదిలివెళ్లింది. పోలీసులు బీదర్‌లో ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారి కిడ్నాప్‌నకు గురైన సోమవారంరాత్రి డ్యూటీ అధికారిణిగా ఏసీపీ చేతన ఉన్నారు. దీంతో కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా అనేక ప్రాంతాల్లో తిరుగుతూ చిన్నారి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. మంగళవారం ఉదయానికి ఆపరేషన్ బీదర్‌కు మారడంతో డీసీపీ ఎం.రమేశ్ అనుమతి తీసుకుని అక్కడకు వెళ్లి పర్యవేక్షించారు. సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ పి.శివశంకర్‌రావు తన డ్రైవర్‌ను ఇచ్చి బీదర్‌కు అంబులెన్స్ పంపారు. ఏసీపీ చేతన గురువారం తెల్లవారుజామున చిన్నారిని తీసుకువచ్చి తల్లిఒడికి చేర్చారు. త్వరలో భద్రతాచర్యలకు సిఫారసులు.. ఆస్పత్రులు తీసుకోవాల్సిన భద్రతాచర్యల్ని నిర్దేశించడానికి అధ్యయనం చేస్తున్నట్లు కొత్వాల్ అంజనీకుమార్ తెలిపారు. ఈస్ట్‌జోన్ డీసీపీ ఎం.రమేశ్, సుల్తాన్‌బజార్ ఏసీపీ డాక్టర్ చేతన వీటిపై రెండు, మూడు రోజుల్లో ఖరారు చేసి నివేదిక ఇస్తారని తెలిపారు. చిన్నారికి తన పేరు పెట్టడం ఆనందంగా, గర్వంగా ఉందని చేతన అన్నారు. చిన్నారికి కామెర్ల లక్షణాలు కనిపించాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం నీలోఫర్ ఆస్పత్రికి తరలిస్తామంటూ కుటుం బీకులు వైద్యుల్ని కోరినా కమిషనర్ వస్తున్నారంటూ వారు తరలించడానికి అంగీకరించలేదు. దీంతో చిన్నారి తండ్రి నారీ బయటకు వచ్చి పోలీసులతో పాటు మీడియాపై అసహనం ప్రదర్శిస్తూ చిన్నారి విషయం చెప్పారు. దీంతో స్పందించిన ఆస్పత్రి వర్గాలు చిన్నారిని బంధువుల సంరక్షణలో అంబులెన్స్‌లో నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. -
పదహారు ‘రకాలుగా’ పోలీసు విధులు
మెరుగైన పనితీరు కోసం విభజించిన కమిషనర్ విభాగాల వారీగా ప్రతిభను గుర్తిస్తున్న అధికారులు కోర్టు విధులు సమర్థంగా నిర్వర్తించిన వారికి రివార్డ్స్ కమిషనరేట్‌లో సమీక్షించిన నగర పోలీసు కమిషనర్ సిటీబ్యూరో: నగర పోలీసుల పనితనం మెరుగుపర్చడంతో పాటు విధి నిర్వహణ సులభతరం చేయడానికి ఠాణాల్లోని విధుల్ని 16 రకాలుగా విభజిస్తూ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సిబ్బంది అర్హత, ఆసక్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయా విధు ల్ని అప్పగించడంతో పాటు వారికి అవసరమైన అదనపు శిక్షణ సైతం ఇప్పించారు. ఈ 16 రకాలైన విధుల్లో ప్రతి అంశంలోనూ ఉత్తమ పనితనం కనబరిచిన సిబ్బందికి రివార్డులు అందిస్తున్నారు. తొలివిడతగా కోర్టు విధులు సమర్థంగా నిర్వర్తించి, న్యాయస్థానాల్లో నిందితులను దోషులుగా నిరూపించడంలో కీలకపాత్ర పోషించిన సిబ్బందికి బుధవా రం కమిషనర్ మహేందర్‌రెడ్డి రివార్డులు అందించారు. నగరంలో 63 పోలీసుస్టేషన్లకు సంబంధించి సిబ్బంది పనితీరును సబ్-డివిజన్ స్థాయిలో ఏసీపీలు, జోన్ స్థాయిలో డీసీపీలు సమీక్షిస్తుండగా...కమిషనరేట్ స్థాయి లో స్వయంగా కమిషనర్ సమీక్షిస్తున్నారు. నగరంలోని 13 ఠాణాలకు సంబంధించిన 18 కీలక కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేసిన 14 మందికి కమిషనర్ రివార్డులందించారు. బంజారాహిల్స్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన కేబీఆర్ పార్క్ కాల్పులు, కిడ్నాప్ ఘట నలో నిందితుడిగా ఉన్న ఓబులేశ్ను దోషిగా నిరూపించడంలో కీలక పాత్ర పోషించిన హెడ్-కానిస్టేబుల్ గోవింద్ నాయుడు, కానిస్టేబుల్ బాలసైదయ్య సైతం రివార్డు అందుకున్న వారిలో ఉన్నారు. విధుల విభజన ఇలా రిసెప్షన్ సిబ్బంది, స్టేషన్ రైటర్లు, క్రైమ్ రైటర్లు, బ్లూకోల్ట్స్ గస్తీ, మొబైల్ పెట్రోలింగ్, కోర్టు విధులు, వారెంట్ ఎగ్జిక్యూషన్ విధులు, సమన్ల ఎగ్జిక్యూషన్ విధు లు, సాంకేతిక విధులు, దర్యాప్తు, నేర విభాగం, మెడికల్ సర్టిఫికెట్ స్టాఫ్, సెక్షన్ ఇన్‌చార్జ్‌లు, సాధారణ విధులు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ల విధులు, ఇన్స్పెక్టర్ల విధులు రివార్డులు పొందింది వీరే.. హెడ్-కానిస్టేబుల్ గోవింద్ నాయుడు, కానిస్టేబుల్ బాల సైదయ్య (బంజారాహిల్స్), ఏఎస్సై మహ్మద్ నజీమ్ అలీ (షాహినాయత్‌గంజ్), కానిస్టేబుల్ శ్రీని వాస్ (అబిడ్స్), కానిస్టేబుల్ కిరణ్‌యాదవ్ (చిక్కడపల్లి), హెడ్-కానిస్టేబుల్ వీఆర్ సుబ్బారావు (అఫ్జల్‌గంజ్), ఏఎస్సై ఇ.జగన్నాథ్‌రెడ్డి (సైదాబాద్), కానిస్టేబుల్ రాజేష్‌కుమార్ (డబీర్‌పుర), హెడ్-కానిస్టేబుల్ రంగస్వామి (అంబర్‌పేట), కానిస్టేబుల్ రాజు (మంగళ్‌హాట్), ఏఎస్సై నరేంద్ర (కుల్సంపుర), కానిస్టేబుళ్లు ఉమామహేశ్వరరావు, సత్యనారాయణ (చిలకలగూడ), కానిస్టేబుల్ రమేష్ (సంతోష్‌నగర్), హెడ్-కానిస్టేబుల్ మోహన్‌రావు (పంజగుట్ట). -
పాత నేరస్తుల మీద సర్వే
పాత నేరస్తులపై సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సర్వేలో 2011 నుంచి ఇప్పటి వరకూ అరెస్టైన పాత నేరస్తుల పూర్తి వివరాలు సేకరించ నున్నారు. ఇప్పటి వరకూ మొత్తం 11,500 మంది పాత నేరస్తుల వివరాలు ఉన్నాయని.. తెలిపారు. సర్వే కోసం హైదరాబాద్ లో ఇంటింటి సర్వే చేయనున్నట్లు వివరించారు. స్థానిక పోలీసులకు నేరస్తుల కదలికలపై అవగాహన కల్పించేందుకే సర్వే చేస్తున్నట్లు సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.ఈ సర్వే వల్ల హైదరాబాద్ లో నేరాలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నామని అన్నారు. -
ఫలించిన ప్రయోగాలు
గణనీయంగా తగ్గిన స్నాచింగ్‌లు గతేడాది మొదటి నాలుగు నెలల్లో 220 కేసులు ఈ ఏడాది 103 మాత్రమే నమోదు చైన్స్నాచర్లపై పీడీ యాక్ట్ నమోదే ప్రధాన కారణం సిటీబ్యూరో: నేరాల నివారణ కోసం నగర పోలీసులు చేస్తున్న సరికొత్త ప్రయోగాలు ఫలితాలిస్తున్నాయి. చైన్‌స్నాచింగ్‌లు గణనీయంగా తగ్గడమే ఇందుకు నిదర్శనం. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 2013 (జనవరి నుంచి ఏపిల్)్రలో 265 స్నాచింగ్ కేసులు నమోదు కాగా... 2014లో 220కి తగ్గాయి. ఈ ఏడాదిలో ఆ సంఖ్య 103కు తగ్గింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సాధారణంగా నేరాలు కూడా పెరుగుతుంటాయి. అయితే చైన్‌స్నాచింగ్‌ల విషయంలో మాత్రం పెరగాల్సిన కేసులను మరింత తగ్గించగలిగారు. కరుడుగట్టిన 33 మంది చైన్ స్నాచర్లపై ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం (పీడీ యాక్ట్) ప్రయోగించడంతో పాటు మరో 70 మంది స్నాచర్లను జైళ్లకు పంపడమే ఇందుకు కారణం. నగర పోలీసు కమిషనర్‌గా గతేడాది జూన్ 2న బాధ్యతలు చేపట్టిన ఎం.మహేందర్ హైదరాబాద్‌ను నేర రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగానే చైన్స్నాచర్లపై పీడీయాక్ట్ ప్రయోగించాలని నిర్ణయించారు. గతంలో కేవలం కరుడు గట్టిన రౌడీషీటర్లపైనే పీడీయాక్ట్ ప్రయోగించేవారు. అయితే, తొలిసారిగా మహేందర్‌రెడ్డి చైన్స్నాచర్లపై పీడీయాక్ట్ ప్రయోగించే కొత్త సాంప్రదాయానికి తెరలేపారు. గడిచిన 10 నెలల కాలంలో కరుడుగట్టిన 33 మంది స్నాచర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ప్రస్తుతం వీరంతా చర్లపల్లి జైలులో ఉన్నారు. ఏడాది పాటు వీరంతా అక్కడ ఉండాల్సిందే. గతంలో చైన్స్నాచర్లను అరెస్టు చేసి జైలుకు పంపితే ఒకటి రెండు రోజుల్లోనే వారికి బెయిల్ వచ్చేది. బెయిల్‌పై బయటకు వచ్చిన వారు మళ్లీ నేరాలు మొదలుపెట్టేవారు. దీన్ని పసిగట్టిన మహేందర్‌రెడ్డి వారికి బెయిల్ లభించకుండా ఉండేందుకు పీడీ యాక్ట్‌ను ఆయుధంగా చేసుకోవడంతో స్నాచింగ్‌లు తగ్గుతున్నాయి. గతంలో నగరంలోని 60 శాంతి భద్రతల పోలీసుస్టేషన్ల పరిధిలో రోజుకు రెండు చొప్పున స్నాచింగ్‌లు జరగగా.. ఇప్పుడు ఒకటి చొప్పున జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో స్నాచింగ్‌లను పూర్తిగా నివారిస్తామని పోలీసులంటున్నారు. పీడీ యాక్ట్ నమోదైన చైన్‌స్నాచర్లు వీరే... ఈస్ట్‌జోన్: మహ్మద్ సైఫుద్దీన్, మహ్మద్ ఇమ్రాన్, సయ్యద్ముజీబ్. సౌత్‌జోన్: షరీఫ్, అహ్మదుద్దీన్ సిద్దిఖ్, జావేద్, సాలమ్జాబ్రీ, పి.లక్ష్మణ్, సంతోష్‌కుమార్, ఎం.భాస్కర్, సయ్యద్అబ్దుల్మాజీద్, సయ్యద్ అస్లమ్. సెంట్రల్‌జోన్: మహ్మద్‌అమీర్, దాసరి సురేందర్, షేక్‌సలీం, నరేష్బాల్కీ, జి.విజయ్కుమార్చౌదరి, మహ్మద్ఫైసల్, సయ్యద్‌ఇమ్రాన్, అబ్దుల్బిన్హాజీ. వెస్ట్‌జోన్: మహ్మద్ఫైసల్, ఇర్ఫాన్‌ఖాన్, ఖాజాఫరీదుద్దీన్, మహ్మద్అబ్దుల్గఫూర్, మహ్మద్మెహరాజ్, మహ్మద్అఫ్రోజ్, మహ్మద్ఇఫ్తేకర్, మహ్మద్ఫైసల్షాఅలీజాబ్రీ, మహ్మద్ఫర్హాన్, బి.జైకిషోర్సింగ్, వెంకటేష్. నార్త్‌జోన్: మహ్మద్‌ఖలీల్, మహ్మద్ముజీబ్అహ్మద్ మరింత తగ్గిస్తాం బంగారు నగలు ధరించి ఒంటరిగా వెళ్లే మహిళలకు పోలీసులకు అండగా ఉంటారు. మేము తీసుకుంటున్న నిర్ణయాల వల్ల గత మూడేళ్లలో చైన్‌స్నాచింగ్‌లు తగ్గాయి. రానున్న రోజుల్లో నేరాలను మరింత తగ్గిస్తాం. ఎక్కడైనా స్నాచింగ్ జరిగితే కేవలం నెలరోజుల్లోనే నిందితుడ్ని గుర్తించి బాధితులకు న్యాయం చేస్తాం. ఇందులో భాగంగా ప్రతి స్టేషన్‌పరిధిలో సీసీ కెమెరాల ప్రాజెక్ట్ వర్క్ చురుగ్గా జరుగుతోంది. - మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ -
అత్యాచారాలపై ఆగ్రహం
* సీఎం ఇంటిని ముట్టడించేందుకు బీజేపీ మహిళా మోర్చా యత్నం * అడ్డుకున్న పోలీసులు * ఎంపీ శోభాకరంద్లాజేతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలపై మహిళల ఆగ్రహం మిన్నంటింది. అత్యాచారాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బుధవారమిక్కడ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగానే వందలాది సంఖ్యలో తరలివచ్చిన మహిళా కార్యకర్తలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో మహిళా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, మహిళా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నివాసం ఎదుట ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసేస్తూ ఆందోళనకారులు ముందుకు దూసుకెళ్లడంతో తీవ్ర ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో ఆందోళనకారుల్లో ఉన్న పార్లమెంటు సభ్యురాలు శోభా కరంద్లాజేతో సైతం పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో బీజేపీ కార్యకర్తలు మరింతగా రగిలిపోయారు. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎంపీ శోభాకరంద్లాజేతో పాటు బీజేపీ నేతలు మాళవిక, తారా అనూరాధలతో పాటు దాదాపు 50 మంది మహిళా మోర్చా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాసేపటికి ఆందోళనకారులను పోలీసులు వదిలిపెట్టారు. ప్రభుత్వ నిరంకుశ ధోరణికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ అని బీజేపీ నేతలు విమర్శించారు. సమస్యలపై ప్రజల పక్షాన పోరాటానికి దిగిన వారిపై పోలీసులను ప్రయోగించడం నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. అనంతరం రోడ్డు పైనే బైఠాయించిన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు తక్షణమే నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి ఘటనా స్థలానికి రావాలంటూ పట్టుబట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ధర్నా జరుగుతున్న ప్రాంతానికి నగర పోలీస్ కమీషనర్ ఎంఎన్ రెడ్డి చేరుకొని ఆందోళన కారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. శోభాకరంద్లాజే పై దురుసుగా ప్రవర్తించిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇవ్వడంతో ఆందోళన కారులు శాంతించారు. కార్యక్రమంలో మాజీ సీఎం యడ్యూరప్ప, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి తదితరులు పాల్గొన్నారు. -
'దూకుడు'పై నిఘా నేత్రం
ట్రాఫిక్ రూల్స్ మీరితే బుక్ అవుతారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే ‘జంపింగ్ జపాంగ్’లూ జాగ్రత్త.. ఇకపై హైదరాబాద్ రహదారులపై రూల్స్ మీరితే మీ జేబులు గుల్లకావడం ఖాయం.. ఎందుకంటే మహానగరంలోని ప్రతీ ట్రాఫిక్ అధికారి కొంగొత్త కెమెరాతో నిఘానేత్రంగా మారిపోయాడు. సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే ‘రోడ్డుసైడ్ రోమియో’లు.. రెడ్ సిగ్నల్ ఖాతరు చేయకుండా దూసుకెళ్లే ‘జంపింగ్ జపాంగ్’లూ కాస్త జాగ్రత్త.. ఇకపై హైదరాబాద్ రహదారులపై రూల్స్ మీరితే మీ జేబులు గుల్లకావడం ఖాయం.. డ్యూటీలో ఉన్న అధికారిపై దురుసుగా ప్రవర్తిస్తే జైలుకెళ్లడం తథ్యం.. పై అధికారికి ఫోన్ చేసో... చలానా రాసే అధికారికి కాస్త ‘ముట్టజెప్పో’ బయటపడుదామనుకునే చాన్స్ కూడా ఇక లేదు.. ఎందుకంటే ఇప్పుడు మహానగరంలోని ప్రతీ ట్రాఫిక్ అధికారి నిఘానేత్రంగా మారిపోయాడు. ‘బాడీవేర్ కెమెరాలు’ అనే కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో మన దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు సరికొత్తగా వచ్చాడు. ట్రాఫిక్ అధికారుల విధుల్లో పారదర్శకత పెంపుతోపాటు నిబంధనల ఉల్లంఘనకు ఒకేసారి చెక్ పెట్టేందుకు ఈ సరికొత్త సాంకేతిక పరికరాలను నెదర్లాండ్స్ నుంచి తెప్పించారు. ఈ బాడీవేర్ కెమెరా ఖరీదు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. వీటి ద్వారా ట్రాఫిక్ పోలీసులు, వాహనదారుల మధ్య జరిగే సంభాషణలను రికార్డు చేయొచ్చు. ట్రాఫిక్ పోలీసుల విధులు సక్రమంగా చేస్తున్నారా లేదా అనే ది కూడా తెలుసుకోవచ్చు. వారం కిందటే ప్రయోగాత్మకంగా సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులకు ఈ కెమెరాలను అందజేశారు. ప్రస్తుతం సైఫాబాద్ ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి ఈ కెమెరాను ఉపయోగిస్తున్నారు. ఈ విధానంలో సత్ఫలితాలు వస్తే త్వరలో నగరంలోని 25 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల అధికారులకు వీటిని అందిస్తామని ట్రాఫిక్ చీఫ్ జితేందర్ తెలిపారు. ఈ కెమెరాలలో రికార్డయిన ఫుటేజీలను బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఉన్న ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’లో అధికారులు భద్రపరుస్తారు. అయితే, ఒకపక్క సెల్‌ఫోన్, మ్యాన్‌ప్యాక్‌తో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న తమకు బాడీవేర్ కెమెరాలు అమర్చితే రేడియేషన్‌కు గురికాక తప్పదని ట్రాఫిక్ అధికారులు వాపోతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని ఆందోళన చెందుతున్నారు. కెమెరా ఎలా పనిచేస్తుందంటే.. ట్రాఫిక్ అధికారి దుస్తులకు బాడీవేర్ కెమెరా అమరుస్తారు. విధి నిర్వహణలో ఉన్నంత సమయం కెమెరా పనిచేస్తుంది. కెమెరాకు 64 జీబీ మెమరీ కార్డు ఉంటుంది. రికార్డయిన ఫుటేజీలు కమాండ్ కంట్రోల్ సెంటర్ అధికారులు నెల రోజుల పాటు భద్రపరుస్తారు. ప్రతి కెమెరాకు ఐపీ కోడ్ ఉంటుంది. విధినిర్వహణలో ఉండి ఈ కెమెరా పెట్టుకున్న అధికారిని జీపీఎస్ ద్వారా ఎక్కడ ఉన్నాడో గుర్తించవచ్చు. ఇవీ ఉపయోగాలు.. వాహనదారుడు, ట్రాఫిక్ అధికారికి మధ్య జరిగిన సంభాషణను ఈ కెమెరాలో వీడి యోతో సహా రికార్డు అవుతుంది. విధుల్లో ఉన్న అధికారి వాహనదారులతో ఎలా ప్రవర్తించింది తెలుస్తుంది. వాహనదారులూ ట్రాఫిక్ అధికారులతో ఎలా ప్రవర్తించారో తెలుసుకోవచ్చు. డ్యూటీలో ఉన్న అధికారితో దురుసుగా మాట్లాడినట్లు తేలితే కేసులు పెట్టొచ్చు. అధికారులు ఎన్ని గంటలు ఏ ప్రాంతంలో విధుల్లో ఉన్నారో తెలుసుకోవచ్చు. డ్యూటీలో లంచం తీసుకునే అధికారులకు దీని ద్వారా చెక్ పెట్టొచ్చు. ఇద్దరికీ ఉపయోగమే.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగానే ఈ కెమెరాలు వాడుతున్నాం. ట్రాఫిక్ తనిఖీలో ఉన్న అధికారికి, వాహనదారుడికి ఈ విధా నం ఉపయోగపడుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే అవకాశం ఉండదు. ఎన్ఫోర్స్మెంట్లో పాల్గొనే ట్రాఫిక్ అధికారులపై వాహనదారులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. మంచి పోలీసుకు ఇది ఆయుధంగా ఉపయోగపడుతుంది. త్వరలో అన్ని ట్రాఫిక్ ఠాణాలకు ఈ కెమెరాలను అందించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. - మహేందర్‌రెడ్డి, నగర కమిషనర్