లక్నో: తన కుమార్తెపై ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగర్ అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన వ్యక్తి సోమవారం పోలీసు కస్టడీలో ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆ వ్యక్తిని ఎమ్మెల్యేపై కుట్ర పన్నుతున్నాడనే అభియోగంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై యూపీ సీఎం ఆదిత్యనాథ్ దర్యాప్తునకు ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులు ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్, ఆయన సోదరులు ఏడాది క్రితం తనను రేప్ చేశారని ఉన్నవోకు చెందిన 18ఏళ్ల అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఎమ్మెల్యేపై కేసు పెట్టని పోలీసులు.. కుట్రకు పాల్పడుతున్నాడంటూ ఆమె తండ్రిని ఈ నెల 5న అరెస్టు చేశారు. దీంతో ఆదివారం ఆ యువతి తన కుటుంబంతో సహా సీఎం ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా జైలులో ఉన్న బాధితురాలి తండ్రిని పోలీసులు అదేరోజు రాత్రి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులే తన తండ్రిని లాఠీలతో బాది చంపేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment