MP shobha karandlaje
-
కామ్‌కి సర్కార్ కాదు.. లూటీకి సర్కారు
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కామ్‌కి సర్కార్ కాదని లూటీకి సర్కారంటూ బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే విమర్శించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గర్భిణీలు, పేదలు, కార్మికులు, వివిధ వర్గాల ప్రజల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాల నిధులను సీఎం ప్రభుత్వం లూటీ చేసిందంటూ ఆరోపించారు. నగర వ్యాప్తంగా 34వేల మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. అందులో కేవలం 11 వేల మంది పారిశుధ్య కార్మికులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తోందని ఆరోపించారు. పేదల కోసమని ప్రారంభించిన ఇందిరా క్యాంటీన్ నిర్మాణాల్లో కూడా అవినీతికి పాల్పడిందని ఎంపీ అన్నారు. అంతేకాకుండా స్వచ్ఛభారత్ కోస కేంద్రం నుంచి విడుదలైన నిధులను కూడా స్వాహా చేశారన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి రమేశ్‌కుమర్ ప్రమేయం లేకుండానే మాతృపూర్ణ పథకం టెండర్లను ఆహ్వానించి తమ వారికే టెండర్లు దక్కేలా వ్యవహరించారని పేర్కొన్నారు. మాతృపూర్ణ పథకంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోగ్యశాఖ కార్యదర్శి రజనీశ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. అదే విధంగా ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీకి విడుదల చేసిన నిధులను కూడా దుర్వినియోగ పరచడంతో కేంద్రప్రభుత్వం నిధులను వెనక్కు తీసేసుకుందన్నారు. వీటన్నింటిపై సీఎం సిద్ధరామయ్య సీబీఐ విచారణకు ఆదేశించాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఎన్ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించాలి మంగళూరుతో పాటు కరావళి ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెచ్చుమీరడంతో ఎన్ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించాలని కేంద్ర హౌంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరనున్నట్లు తెలిపారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన కేఎఫ్‌డీ,పీఎఫ్ఐ తదితర సంస్థలను నిషేధించాలంటూ సీఎంను డిమాండ్ చేశారు. -
‘రాహుల్ ఓ బచ్చా !’
బెంగళూరు : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఒక బచ్చా అని, ఆయనకు ప్రధాని మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఎంపీ, బీజేపీ నాయకురాలు శోభా కరందాజ్లే గురువారం రాహుల్‌పై మండిపడ్డారు. బీదర్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ఇంకా రాజకీయ పాఠాలు చాలా నేర్చుకోవాలని అన్నారు. దేశంలో ఎక్కడ అభివృద్ధి జరగడం లేదని అంటున్న కాంగ్రెస్ నాయకులు రైతుల కన్నీళ్ల పేరు చెప్పుకుంటూ నాటకం ఆడుతున్నారని ఎంపీ అన్నారు. ఒకసారి కళ్లు తెరచి జరిగిన అభివృద్ధి చూడాలని ఆమె హితవు పలికారు. -
అత్యాచారాలపై ఆగ్రహం
* సీఎం ఇంటిని ముట్టడించేందుకు బీజేపీ మహిళా మోర్చా యత్నం * అడ్డుకున్న పోలీసులు * ఎంపీ శోభాకరంద్లాజేతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న అత్యాచారాలపై మహిళల ఆగ్రహం మిన్నంటింది. అత్యాచారాలను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బుధవారమిక్కడ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగానే వందలాది సంఖ్యలో తరలివచ్చిన మహిళా కార్యకర్తలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో మహిళా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, మహిళా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నివాసం ఎదుట ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసేస్తూ ఆందోళనకారులు ముందుకు దూసుకెళ్లడంతో తీవ్ర ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఇదే సమయంలో ఆందోళనకారుల్లో ఉన్న పార్లమెంటు సభ్యురాలు శోభా కరంద్లాజేతో సైతం పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో బీజేపీ కార్యకర్తలు మరింతగా రగిలిపోయారు. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎంపీ శోభాకరంద్లాజేతో పాటు బీజేపీ నేతలు మాళవిక, తారా అనూరాధలతో పాటు దాదాపు 50 మంది మహిళా మోర్చా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాసేపటికి ఆందోళనకారులను పోలీసులు వదిలిపెట్టారు. ప్రభుత్వ నిరంకుశ ధోరణికి ఇదో ప్రత్యక్ష ఉదాహరణ అని బీజేపీ నేతలు విమర్శించారు. సమస్యలపై ప్రజల పక్షాన పోరాటానికి దిగిన వారిపై పోలీసులను ప్రయోగించడం నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. అనంతరం రోడ్డు పైనే బైఠాయించిన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు తక్షణమే నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి ఘటనా స్థలానికి రావాలంటూ పట్టుబట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ధర్నా జరుగుతున్న ప్రాంతానికి నగర పోలీస్ కమీషనర్ ఎంఎన్ రెడ్డి చేరుకొని ఆందోళన కారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. శోభాకరంద్లాజే పై దురుసుగా ప్రవర్తించిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇవ్వడంతో ఆందోళన కారులు శాంతించారు. కార్యక్రమంలో మాజీ సీఎం యడ్యూరప్ప, మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జోషి తదితరులు పాల్గొన్నారు.