సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కామ్‌కి సర్కార్ కాదని లూటీకి సర్కారంటూ బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే విమర్శించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గర్భిణీలు, పేదలు, కార్మికులు, వివిధ వర్గాల ప్రజల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాల నిధులను సీఎం ప్రభుత్వం లూటీ చేసిందంటూ ఆరోపించారు. నగర వ్యాప్తంగా 34వేల మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. అందులో కేవలం 11 వేల మంది పారిశుధ్య కార్మికులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తోందని ఆరోపించారు.
పేదల కోసమని ప్రారంభించిన ఇందిరా క్యాంటీన్ నిర్మాణాల్లో కూడా అవినీతికి పాల్పడిందని ఎంపీ అన్నారు. అంతేకాకుండా స్వచ్ఛభారత్ కోస కేంద్రం నుంచి విడుదలైన నిధులను కూడా స్వాహా చేశారన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి రమేశ్‌కుమర్ ప్రమేయం లేకుండానే మాతృపూర్ణ పథకం టెండర్లను ఆహ్వానించి తమ వారికే టెండర్లు దక్కేలా వ్యవహరించారని పేర్కొన్నారు.
మాతృపూర్ణ పథకంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోగ్యశాఖ కార్యదర్శి రజనీశ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. అదే విధంగా ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీకి విడుదల చేసిన నిధులను కూడా దుర్వినియోగ పరచడంతో కేంద్రప్రభుత్వం నిధులను వెనక్కు తీసేసుకుందన్నారు. వీటన్నింటిపై సీఎం సిద్ధరామయ్య సీబీఐ విచారణకు ఆదేశించాలని ఎంపీ డిమాండ్ చేశారు.
ఎన్‌ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించాలి
మంగళూరుతో పాటు కరావళి ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెచ్చుమీరడంతో ఎన్‌ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించాలని కేంద్ర హౌంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరనున్నట్లు తెలిపారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన కేఎఫ్‌డీ,పీఎఫ్‌ఐ తదితర సంస్థలను నిషేధించాలంటూ సీఎంను డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment