
సాక్షి, మాదికేరి (కర్ణాటక): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరోసారి హిందూత్వ సంస్థలపై మండిపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్, బజరంగ్ దళ్‌లో ఉగ్రవాద శక్తులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. అతివాద ఎస్డీపీఐ అయినా, బజరంగ్ దళ్ అయినా శాంతిని భగ్నం చేస్తే విడిచిపెట్టబోమని హెచ్చరించారు.
ఆదమరిచి నిద్రించిన సిద్దూ..!
కర్ణాటక సీఎం సిద్దరామయ్య బుధవారం ఉదయం మదికేరిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వేదికపై ఆదమరిచి నిద్రిస్తూ మీడియా కంటికి చిక్కారు. ఓవైపు కార్యక్రమం జరుగుతున్నా.. అదేమి పట్టనట్టు ఆయన కునుకుతీశారు. ఆయన నిద్రిస్తున్న ఫొటోలు సోషల్ మీడియలో దర్శనమివ్వడంతో ఆయనపై నెటిజన్లు సెటైర్లు, జోకులు వేస్తూ.. పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు.