సాక్షి, ముంబై : ఇటీవల అంధేరిలోని లోటస్ బిజినెస్ పార్క్ భవనానికి జరిగిన అగ్ని ప్రమాదం ఘటనతో మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పరిపాలన విభాగం కళ్లు తెరిచింది. బహుళ అంతస్తుల భవనం ఆఖరు అంతస్తు వరకు చేరుకునేందుకు భారీ పొడవైన నిచ్చెనతో కూడిన ఫైరింజన్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. గత శుక్రవారం 22 అంతస్తుల లోటస్ బిజినెస్ భవనాన్ని చుట్టుముట్టిన మంటలను ఆర్పివేసేందుకు అగ్నిమాపక జవాన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. మంటలను ఆర్పివేసే ప్రయత్నంలో ఒక జవాను మృతి చెందడం, 15 మంది గాయపడడంతో ఆ శాఖలో ఉన్న లోపాలేంటో బహిర్గతమయ్యాయి.
రూ. 19.18 కోట్ల అంచనా
త్వరలో 90 మీటర్ల ఎత్తున్న నిచ్చెనతో కూడిన కొత్త ఫైరింజన్‌ను కొనుగోలు చేయాలని బీఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ వాహనానికి రూ.19.18 కోట్లు ఖర్చవుతాయని అంచనవేశారు. అందుకు సంబంధించిన ప్రతిపాదన బుధవారం స్థాయి సమితి ముందుకు రానుంది. ఈ నిచ్చెన ప్రత్యక్షంగా ముంబై అగ్నిమాపక శాఖ ఆధీనంలోకి వస్తే దేశంలోనే అత్యంత పొడవైన నిచ్చెన వాహనంగా గుర్తింపు లభించనుంది.
భైకళ నుంచి వచ్చే సరికి..
ప్రస్తుతం బీఎంసీ వద్ద 68 మీటర్ల ఎత్తున్న నిచ్చెనతో కూడిన ఫైరింజన్ ఒకటే ఉంది. ఇది కేవలం 20వ అంతస్తు వరకే చేరుకుంటుంది. ఆపై అంతస్తుల్లో అగ్నిప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బందికి భవనం మెట్ల ద్వారా పైకి వెళ్లాల్సి వస్త్తోంది. అప్పటికే దట్టమైన పొగ చుట్టుముడితే ప్రాణాల మీద ఆశ వదులు కోవాల్సిందే. ఇదిలాఉండగా 68 మీటర్ల ఎత్తున్న నిచ్చెన గల ఈ ఫైరింజన్ అగ్నిమాపక ప్రధాన కేంద్రమైన భైకళలో నిలిచి ఉంటుంది. నగరంలో ఎక్కడ బహుళ అంతస్తుల భవనానికి అగ్నిప్రమాదం జరిగినా భైకళ నుంచి ఈ ఫైరింజన్ వెళ్లాల్సిందే. విపరీతంగా పెరిగిపోయిన ఈ ట్రాఫిక్ జాంలో ఆ భారీ ఫైరింజన్ దారి వెతుక్కుంటూ ఈ మూల నుంచి ఆ మూలకు చేరుకోవాలంటే కసర త్తు చేయాల్సిందే. అప్పటికే జరగాల్సిన ఆస్తి, ప్రాణ నష్టం జరిగిపోతుంది.
శివారులో మరో ఫైరింజన్
అదనంగా మరో ఫైరింజిన్ కొనుగోలు చేసి శివారు ప్రాంతంలో అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు అగ్నిమాపక శాఖ చీఫ్ ఎ.ఎన్.వర్మ చెప్పారు. దీన్ని ఎలా వినియోగించాలో అందుకు అవసరమైన శిక్షణ అగ్నిమాపక సిబ్బందికి ఇవ్వనున్నారు. అందుకు ఇంజినీర్లను ఫిన్‌ల్యాండ్‌కు పంపిస్తారని వర్మ చెప్పారు.
ఈ వాహనాన్ని ఫిన్‌ల్యాండ్ దేశానికి చెందిన ‘బ్రాంటో స్కైలిఫ్ట్ ఓవాయ్ ఏబీ’ అనే కంపెనీ నుంచి కొనుగోలు చేయనున్నారు. 500 కేజీల బరువును భరించే సామర్థ్యం ఈ నిచ్చెనలో ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం నగరం, శివారు ప్రాంతాల్లో ఎక్కడ చూసినా బహుళ అంతస్తుల (అద్దాల మేడలు) విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ఆ ప్రకారం భవిష్యత్తులో ప్రమాదాల సంఖ్య కూడా పెరిగే అవకాశాలున్నాయి.
కళ్లు తెరిచిన బీఎంసీ
Published Tue, Jul 22 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM
Advertisement
Advertisement