37 మంది ఆదివాసీల కాల్చివేత
అస్సాంలో బోడో మిలిటెంట్ల ఘాతుకం
గువాహటి: ఈశాన్య రాష్ర్టమైన అస్సాంలో బోడో మిలిటెంట్లు నరమేధం సృష్టించారు. సోనిత్‌పూర్, కోక్రాఝర్ జిల్లాల్లోని ఐదు వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (ఎన్‌డీఎఫ్‌బీ) సోంగ్‌బిజిత్ ఫాక్షన్ వర్గానికి చెందిన మిలిటెంట్లు ఆదివాసీ గ్రామాలపై మెరుపు దాడులు చేసి 37 మందిని విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో మరో 10 మంది గాయపడ్డారు. ఒక్క సోనిత్‌పూర్ జిల్లాలోనే 30 మంది అమాయక ఆదివాసీలను హతమార్చిన మిలిటెంట్లు, కోక్రాఝర్ జిల్లాలో ఏడుగురిని పొట్టనపెట్టుకున్నారు.
మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్‌తో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు వెంబడి భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేసినందుకు ప్రతీకారంగానే మిలిటెంట్లు ఈ మారణహోమానికి పాల్పడ్డారని అస్సాం ఐజీపీ (శాంతిభద్రతలు) ఎస్.ఎన్. సింగ్ పేర్కొన్నారు. శాంతి చర్చలను వ్యతిరేకిస్తున్న మిలిటెంట్లే ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అస్సాం అదనపు డీజీపీ పల్లభ్ భట్టాచార్య తెలిపారు.
మరోవైపు మిలిటెంట్ల ఘాతుకాన్ని ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తీవ్రంగా ఖండించారు. మిలిటెంట్ల మారణహోమాన్ని పిరికిపంద చర్యగా మోదీ అభివర్ణించారు. ఈ ఘటన నేపథ్యంలో రాజ్‌నాథ్ అస్సాంలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకుంటారన్నారు. దాడుల ప్రాంతాలకు పారామిలిటరీ దళాలను పంపినట్లు రాజ్‌నాథ్ చెప్పారు.