National Democratic Front of Bodoland
-
37 మంది ఆదివాసీల కాల్చివేత
అస్సాంలో బోడో మిలిటెంట్ల ఘాతుకం గువాహటి: ఈశాన్య రాష్ర్టమైన అస్సాంలో బోడో మిలిటెంట్లు నరమేధం సృష్టించారు. సోనిత్పూర్, కోక్రాఝర్ జిల్లాల్లోని ఐదు వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (ఎన్డీఎఫ్బీ) సోంగ్‌బిజిత్ ఫాక్షన్ వర్గానికి చెందిన మిలిటెంట్లు ఆదివాసీ గ్రామాలపై మెరుపు దాడులు చేసి 37 మందిని విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో మరో 10 మంది గాయపడ్డారు. ఒక్క సోనిత్పూర్ జిల్లాలోనే 30 మంది అమాయక ఆదివాసీలను హతమార్చిన మిలిటెంట్లు, కోక్రాఝర్ జిల్లాలో ఏడుగురిని పొట్టనపెట్టుకున్నారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్‌తో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు వెంబడి భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేసినందుకు ప్రతీకారంగానే మిలిటెంట్లు ఈ మారణహోమానికి పాల్పడ్డారని అస్సాం ఐజీపీ (శాంతిభద్రతలు) ఎస్.ఎన్. సింగ్ పేర్కొన్నారు. శాంతి చర్చలను వ్యతిరేకిస్తున్న మిలిటెంట్లే ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అస్సాం అదనపు డీజీపీ పల్లభ్ భట్టాచార్య తెలిపారు. మరోవైపు మిలిటెంట్ల ఘాతుకాన్ని ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తీవ్రంగా ఖండించారు. మిలిటెంట్ల మారణహోమాన్ని పిరికిపంద చర్యగా మోదీ అభివర్ణించారు. ఈ ఘటన నేపథ్యంలో రాజ్‌నాథ్ అస్సాంలో పర్యటించి వివరాలు అడిగి తెలుసుకుంటారన్నారు. దాడుల ప్రాంతాలకు పారామిలిటరీ దళాలను పంపినట్లు రాజ్‌నాథ్ చెప్పారు. -
అసొంలో బోడో ఉగ్రవాదుల దాడి, 10 మంది హతం
అసొంలో మరోసారి అశాంతి, అరాచకం రాజ్యమేలింది. అసొంలోని బోడోలాండ్ ప్రాంత పాలనా జిల్లా (బీటీఏడీ) పరిధిలో ఎన్ డీ ఎఫ్ బీ (నేషనల్ డెమాక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్) ఉగ్రవాదులు ఇద్దరు పసివాల్లు, నలుగురు మహిళలు సహా పదిమందిని పొట్టనబెట్టుకున్నారు. ఎన్నికల వేళ రాష్ట్రంలోని బోడో జనాధిక్య ప్రాంతాల్లో బోడో గ్రూపులైన బోడోలాండ్ టైగర్స్ ఫోర్స్ (బిఎల్ టీ ఎఫ్) ల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొని ఉంది. ఇదే ఆధిక్య పోరులో అమాయకులు బలయ్యారు. కోక్రాఝార్ జిల్లాలో ఏడుగురు చనిపోయారు. ఉగ్రవాదులు ఒక ఇంట్లో చొరబడి ఏడుగురిని చంపేశారు. అదే రాత్రి బాస్కా జిల్లాలో ముగ్గురిని ఉగ్రవాదులు చంపేశారు. దీంతో గతేడాది కోక్రాఝార్ తరువాత నెలకొన్న ప్రశాంతి భగ్నమై కథ మళ్లీ మొదటికి వచ్చింది. గతేడాది బోడోలకు, బంగ్లాదేశీ వలసదారు ముస్లింలకు మద్య బోడోలాండ్ ప్రాంతంలో భారీ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలో దాదాపు లక్ష మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చాలా మంది ఇప్పటికీ శరణార్థులుగా బతుకు వెళ్లదీస్తున్నారు. -
బస్సుపై తీవ్రవాదుల దాడి: ఐదుగురు మృతి
అసోంలో తీవ్రవాదులు మరోసారి తెగబడ్డారు. నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బొడోలాండ్ (ఎన్డీఎఫ్బీ)కు చెందిన తీవ్రవాదులు గత అర్థరాత్రి బస్సుపై దాడి చేశారు. ఆ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి జి.డి.త్రిపాఠి శనివారం ఇక్కడ వెల్లడించారు. తీవ్రవాదులు తుపాకులతో బెదిరించి ప్రయాణికులను బస్సులో నుంచి కిందకి దింపి వారిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారని తెలిపారు. బెంగాగాన్ నుంచి కోక్రాఝర్ వెళ్తుండగా సెఫంగురి పోలీసు స్టేషన్ పరిధిలోని అతియబరి తినిలి వద్ద ఆ ఘటన చోటు చేసుకుందని వివరించారు. అయితే ఆ ఘటన అనంతరం మరో ఇద్దరు ప్రయాణికులు ఆచూకీ తెలియకుండా పోయిందన్నారు. ఆ దుర్ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి ఘటన స్థలానికి పంపామన్నారు. తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు త్రిపాఠి చెప్పారు.