అసోంలో తీవ్రవాదులు మరోసారి తెగబడ్డారు. నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బొడోలాండ్ (ఎన్డీఎఫ్బీ)కు చెందిన తీవ్రవాదులు గత అర్థరాత్రి బస్సుపై దాడి చేశారు. ఆ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి జి.డి.త్రిపాఠి శనివారం ఇక్కడ వెల్లడించారు. తీవ్రవాదులు తుపాకులతో బెదిరించి ప్రయాణికులను బస్సులో నుంచి కిందకి దింపి వారిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారని తెలిపారు.
బెంగాగాన్ నుంచి కోక్రాఝర్ వెళ్తుండగా సెఫంగురి పోలీసు స్టేషన్ పరిధిలోని అతియబరి తినిలి వద్ద ఆ ఘటన చోటు చేసుకుందని వివరించారు. అయితే ఆ ఘటన అనంతరం మరో ఇద్దరు ప్రయాణికులు ఆచూకీ తెలియకుండా పోయిందన్నారు. ఆ దుర్ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి ఘటన స్థలానికి పంపామన్నారు. తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు త్రిపాఠి చెప్పారు.