'బోడో తీవ్రవాదులతో చర్చలు జరపం'
గువాహటి: బోడో తీవ్రవాదులతో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అమాయక ఆదివాసీలను దారుణంగా కాల్చిచంపిన తీవ్రవాదులతో కేంద్రం చర్చలు జరపబోదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)తో విచారణ జరిపిస్తామన్నారు. అసోంలోని సోనిత్‌పూర్ జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... అసోం పోలీసులు, పారామిలటరీ, సైన్యం సహకారంతో తీవ్రవాద తండాలను తుదముట్టిస్తామని చెప్పారు. ఇందుకోసం అసోంకు ఇప్పటికే 50 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను పంపినట్టు వెల్లడించారు. శాంతి, సంయమనం పాటించాలని ఆయన వివిధ వర్గాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన ఆదివాసీల కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారని రాజ్నాథ్ తెలిపారు.