సల్మాన్ఖాన్ కేసులో కీలక పరిణామం!
ముంబై: 2002నాటి హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు భారీ ఊరట లభించే అవకాశం కనిపిస్తున్నది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ ప్రధాన సాక్షి రవీంద్ర పాటిల్ వాదనను బొంబాయి హైకోర్టు తోసిపుచ్చింది. 2002 సెప్టెంబర్ 28న జరిగిన ఈ ఘటనలో రోడ్డుపక్కన పేవ్మెంట్ మీద పడుకున్న ఓ వ్యక్తి చనిపోయాడు. నలుగురు గాయపడ్డారు. వైల్ పార్లేలోని 'రాణి బార్ అండ్ రెస్టారెంట్'లో మద్యాన్ని సేవించిన సల్మాన్ టయోటా లెక్సస్ వాహనాన్ని నడుపుతూ ఓ షాపులోకి దూసుకెళ్లాడని, దీంతో ఆ షాపు ఎదురుగా పడుకున్న ఓ వ్యక్తి చనిపోగా, నలుగురు గాయపడ్డారని ప్రాసిక్యూషన్ వాదిస్తున్నది. అయితే, ఈ ఘటనలో గాయపడ్డ రవీంద్ర పాటిల్ ప్రధాన సాక్ష్యంగా చెప్పిన వాదనలో పలు విరుద్ధ అంశాలు ఉన్నాయని, అంతేకాకుండా ఘటన సమయంలో సల్మాన్ తాగి ఉన్నాడనే సాక్షి వాదనలో సత్యమెంతో రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు పేర్కొంది.
'సల్మాన్ తాగి ఉన్నాడని, సంఘటనాస్థలం నుంచి పారిపోయే సమయంలో ఆయన రెండుసార్లు తూలి పడిపోయాడని సాక్షి చెప్పాడు. దీనినిబట్టి ప్రాసిక్యూషన్ ప్రధాన సాక్షి రవీంద్ర పాటిల్ ఆయన తాగి ఉన్నట్టు చూసే అవకాశముండదు. 2012 అక్టోబర్ 1 తర్వాతే దర్యాప్తులో మద్యం అంశం వెలుగులోకి వచ్చింది' అని హైకోర్టు పేర్కొంది. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు సెషన్స్ కోర్టు ఈ ఏడాది మేలో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు.