సల్మాన్‌ఖాన్‌ నిర్దోషి: హైకోర్టు తీర్పు | Salman Khan to be present in Bombay HC for 2002 hit-and-run case verdict | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ఖాన్‌ నిర్దోషి: హైకోర్టు తీర్పు

Published Fri, Dec 11 2015 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

సల్మాన్‌ఖాన్‌ నిర్దోషి: హైకోర్టు తీర్పు

సల్మాన్‌ఖాన్‌ నిర్దోషి: హైకోర్టు తీర్పు

హిట్ అండ్ రన్ కేసులో బాంబే హైకోర్టు తీర్పు
 
 ముంబై: ‘హిట్ అండ్ రన్’ కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్(49)ను గురువారం బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. మితిమీరి మద్యం సేవించిన ప్రభావంతో వేగంగా కారును నడిపి, పేవ్‌మెంట్‌పై నిద్రిస్తున్న ఒక వ్యక్తి మరణానికి, మరో నలుగురు గాయాలపాలు కావడానికి కారణమయ్యాడన్న ఆరోపణలతో నమోదైన కేసులో.. ఆ ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కేసును కొట్టివేసింది. ప్రమాదం సమయంలో సల్మాన్ తాగి ఉన్నట్లుగానీ, డ్రైవింగ్ తానే చేస్తున్నట్లుగానీ ప్రాసిక్యూషన్ నిర్దిష్టంగా నిరూపించలేకపోయిందని పేర్కొంది. సల్మాన్ బాడీగార్డ్ అయిన ప్రత్యక్ష సాక్షి రవీంద్ర పాటిల్ సాక్ష్యంలో లోపాలున్నాయని, ఆయన సాక్ష్యాన్ని విశ్వసించలేమని స్పష్టం చేస్తూ సల్మాన్‌ను విముక్తుడిని చేసింది.

హైకోర్టు తీర్పుతో 13 ఏళ్ల నాటి కేసు నుంచి సల్మాన్‌కు తాత్కాలికంగా ఊరట లభించినట్లైంది. తనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువడగానే తీవ్ర భావోద్వేగానికి గురైన సల్మాన్ కన్నీటి పర్యంతమయ్యారు. హైకోర్టు తీర్పుపై అపీల్‌కు వెళ్లాలా? వద్దా? అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. ఈ  కేసులో దోషిగా పేర్కొంటూ, స్థానిక ట్రయల్ కోర్టు గతంలో ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, ఆ తీర్పును సవాలు చేస్తూ ఖాన్ హైకోర్టును ఆశ్రయించగా ఈ తీర్పు వెలువడింది.

 13 ఏళ్ల ప్రస్థానం..: 2002 సెప్టెంబర్ 28 అర్ధరాత్రి ఒక బార్‌లో మద్యం సేవించి,  వాహనంలో మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేస్తూ బాంద్రా శివార్లలో పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపై దూసుకెళ్లాడని, ఆ ఘటనలో ఒక వ్యక్తి చనిపోగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. ప్రమాద సమయంలో సల్మాన్‌తో పాటు ఉన్న ఆయన బాడీగార్డ్ రవీంద్ర పాటిల్.. పోలీస్ స్టేషన్‌కు సమాచారమిచ్చారు. ఆ సమయంలో సల్మాన్ తాగి ఉన్నట్లు రవీంద్ర పాటిల్ చెప్పలేదు. కానీ తన సలహాను కాదని, వేగంగా కారు నడిపారని పోలీసులకు చెప్పారు. ఆ తరువాత ఇచ్చిన సాక్ష్యాల్లో మాత్రం ప్రమాద సమయంలో సల్మాన్ మద్యం ప్రభావంలో ఉన్నారని చెప్పారు. 2007లో టీబీతో ఆయన మరణించారు.

 హ్యాప్పీ హీరో: తీర్పు సమయంలో కచ్చితంగా హాజరు కావాలన్న జడ్జి ఆదేశాలపై బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో చెల్లి అల్వీరా, బావమరిది ఆయుష్, బాడీగార్డ్ షేరాతో కలిసి సల్మాన్ కోర్టుకు వచ్చారు. ఖాన్ తీర్పు తర్వాత పెద్ద భారం దిగినట్లుగా కనిపించారు. తీర్పు సమయంలో సల్మాన్ అభిమానులు, లాయర్లు, హైకోర్టు సిబ్బందితో కోర్టు హాలు నిండిపోయింది. ‘ఈ తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నా. ఈ విషయంలో నాకు తోడుగా నిలిచి, నా కోసం ప్రార్ధించిన నా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు కృతజ్ఞతలు’ అని సల్మాన్ ట్వీట్ చేశారు. ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటించడాన్ని బాలీవుడ్ స్వాగతించింది. తీర్పుపై పరిశ్రమ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు చాలా సంతోషాన్ని కలిగించిందని బాలీవుడ్ ప్రముఖులు అనీస్ బాజ్మీ, మాధుర్ భండార్కర్, మాధురి దీక్షిత్, సుభాష్ ఘాయ్ పేర్కొన్నారు.
 
 తీర్పు ముఖ్యాంశాలు
  ‘సల్మాన్ అపీల్‌ను అనుమతిస్తున్నాం. విచారణ కోర్టు తీర్పును కొట్టేస్తున్నాం. ఆయన్ను అన్ని ఆరోపణల నుంచి నిర్దోషిగా విడుదల చేస్తున్నాం’ అని న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ జోషి తీర్పు ప్రకటించారు. ‘సల్మాన్‌పై ఆరోపణలను ప్రాసిక్యూషన్ నిర్దిష్టంగా, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా నిరూపించలేకపోయిందని కోర్టు నమ్ముతోంది. ప్రమాదం జరిగాక టైర్ పేలిందా? టైర్ పేలడం వల్ల ప్రమాదం జరిగిందా? అనే విషయంపై కూడా స్పష్టతనివ్వలేకపోయింది. సాక్ష్యాధారాలు చాలా బలహీనంగా ఉన్నాయి. కీలక సాక్షుల స్టేట్‌మెంట్స్‌ను ప్రాసిక్యూషన్ సేకరించలేదు.

గాయాల పాలైనవారి సాక్ష్యాలు కూడా నిర్దిష్టంగా లేవు. సల్మాన్ ఖాన్ రక్త నమూనాను సేకరించడంలో, దాన్ని భద్రపరచిన విధానంలో, ఆ రక్త నమూనాల్లో ఆల్కహాల్ ఉందా? అనే విషయాన్ని నిర్ధారించే పరీక్షను జరపడంలో చాలా లోపాలు కనిపిస్తున్నాయి. ప్రమాద సమయంలో సల్మాన్‌తో పాటు ఉన్న ఆయన మిత్రుడు, గాయకుడు కమాల్ ఖాన్‌ను కూడా ప్రాసిక్యూషన్ విచారించలేదు. సల్మాన్ మద్యం సేవించాడనేందుకు రుజువుగా ప్రాసిక్యూషన్ సమర్పించిన రెయిన్ బార్ బిల్లులు సరైనవి కాదు. అవి ప్రమాదం జరిగిన రోజు డేట్‌తో కాకుండా ముందు రోజువి.ఆ బిల్లులను సాక్ష్యంగా స్వీకరించి ట్రయల్ కోర్టు తప్పు చేసింది’ అని పేర్కొన్నారు. దర్యాప్తులో లోపాలున్నాయి. ఇది నిందితుడికి అనుకూలంగా పరిణమిస్తుంది.

 సెక్షన్ 304ఏ, సెక్షన్ 304 పార్ట్ 2.. వేరువేరు
 ‘భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 304ఏ(నిర్లక్షపూరిత డ్రైవింగ్‌తో ఎదుటివారి మృతికి కారణమవడం), 304 పార్ట్ 2(ఉద్దేశపూర్వకం కానీ నేరపూరిత హత్య)ల మధ్య చాలా తేడా ఉంది. 304ఏలో గరిష్టంగా రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉండగా.. 304 పార్ట్ 2లో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఇది 304ఏ కింద, ఆ తరువాత సెషన్స్ కోర్టులో 304 పార్ట్ 2 కింద ఈ కేసును విచారించారు. పై రెండు సెక్షన్ల కిందకు వచ్చే నేరాల స్వభావం వేరువేరు. వాటిని ఒకే గాటన కట్టలేం’ అని జస్టిస్ జోషి వివరించారు. ‘ప్రత్యక్ష సాక్షి రవీంద్ర పాటిల్ మరణించాడు.

ఆయనను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆయన సాక్ష్యాన్ని అంగీకరించలేం’ అన్నారు. 13 ఏళ్ల తరువాత వచ్చి ప్రమాద సమయంలో తానే డ్రైవింగ్ చేస్తున్నానన్న సల్మాన్ డ్రైవర్ అశోక్‌సింగ్ సాక్ష్యమివ్వడాన్ని తప్పుడు సాక్ష్యంగా ట్రయల్ కోర్టు నిర్ధారించడం తప్పని జస్టిస్ జోషి తేల్చిచెప్పారు. ప్రమాదం జరగగానే అశోక్‌సింగ్ కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన స్టేట్‌మెంట్ కూడా తీసుకోవాలని కోరాడని, అయితే, ఆ అభ్యర్థనను పోలీసులు పట్టించుకోలేదని ఢిఫెన్స్ లాయర్ చేసిన వాదనను జస్టిస్ జోషి ఆమోదించారు.

 ప్రజాభిప్రాయం, చట్టం.. వేరువేరు
 ‘అనుమానం బలంగా ఉన్నంతమాత్రాన ఒకరిని దోషిగా నిర్ధారించలేం. ప్రజాభిప్రాయం ఎలా ఉందో మాకు తెలుసు. అది సమాజంలో స్థిరపడిన అభిప్రాయం. కోర్టులు చట్టప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. నిందితుల వృత్తి, స్థాయిల ప్రభావం కోర్టులపై ఉండకూడదు’ అని వ్యాఖ్యానించారు. సల్మాన్‌ఖాన్ పాస్‌పోర్టును తిరిగిచ్చేయాలని బాంద్రా పోలీసులను, రూ. 25 వేల పూచికత్తు సమర్పించాలని సల్మాన్‌ఖాన్‌ను ఆయన ఆదేశించారు.
 
 ఇంతకీ ఆనాడు కారు నడిపిందెవరు?
 ప్రాసిక్యూషన్ వాదన: ‘ప్రమాద సమయంలో ఆ కారును సల్మాన్ స్వయంగా డ్రైవ్ చేస్తున్నాడు.  ఆయన మద్యం ప్రభావంలో ఉండి, అత్యంత వేగంగా కారును నడిపాడు. అదుపుతప్పిన కారు పేవ్‌మెంట్ పైకి దూసుకువెళ్లడంతో అక్కడ నిద్రిస్తున్న నూరుల్లా అక్కడికక్కడే చనిపోయాడు. మరో నలుగురు తీవ్రం గా గాయపడ్డారు. ఆ సమయంలో కారులో సల్మాన్‌తో పాటు సింగర్ కమాల్ ఖాన్, బాడీగార్డ్ రవీంద్ర పాటిల్ మాత్రమే ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి అయిన రవీంద్ర పాటిల్ సాక్ష్యం కూడా ఉంది’

 ఢిఫెన్స్ వాదన: ‘ప్రమాద సమయంలో కారు ను డ్రైవ్ చేస్తోంది సల్మాన్ డ్రైవర్ అశోక్ సింగ్. ఆ విషయాన్ని అశోక్ ఒప్పుకున్నాడు. అప్పు డు సల్మాన్ మద్యం సేవించి లేడు. తప్పుడు హోటల్ బిల్లులను రుజువులుగా ప్రాసిక్యూషన్ చూపుతోంది. కారు తనపైకి దూసుకెళ్లడం వల్ల నూరుల్లా చనిపోలేదు. ప్రమాదం అనంతరం పోలీసులు వచ్చి కారును క్రేన్‌తో పైకి లేపుతుండగా, అది ప్రమాదవశాత్తూ జారి, నూరుల్లాపై పడటంతో చనిపోయాడు.’
 
 మాకేం న్యాయం జరిగింది!
  ముంబై/గోండా:  కేసు నుంచి సల్మాన్ బయటపడటంతో బాధితులు  కోర్టు తీర్పుపై అసంతృప్తితో ఉన్నారు. ‘ఇన్నేళ్లు ఎదురు చూసింది ఈ తీర్పుకోసమేనా? ’అని ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకున్న అబ్దుల్లా అన్నారు. కాలు పోయి, ఏ పనీ చేయలేకపోతున్నానన్నారు. ‘నాకు చిన్న పిల్లలున్నారు. మాకు పరిహారం విషయంలో కోర్టు ఆలోచించి ఉంటే బాగుండేది. ’ అని తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు కాళ్లు పొగొట్టుకున్న యూపీకి చెందిన అబ్దుల్ షేక్ కూడా కోర్టు తీర్పుతో తమకేం న్యాయం జరగలేదన్నారు. కుటుంబ పోషణకు కష్టమవుతున్నందున.. సల్మాన్ తమకు రూ. 10-15లక్షలు పరిహారంగా ఇస్తే సంతోషిస్తామని షేక్ భార్య రేష్మా కోరారు. వీరి కోసం  సల్మాన్ కోర్టులో రూ.19 లక్షలను జమచేశారు.
 
 అక్టోబర్ 2002 - డిసెంబర్ 2015
 2002, సెప్టెంబర్ 28: సల్మాన్‌కు చెందిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ కారు బాంద్రా శివార్లలో ఉన్న అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బేకరీ బయట పేవ్‌మెంట్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఒకరు చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెయిన్ బార్‌లో మద్యం సేవించి, వేగంతో సొంతంగా డ్రైవ్ చేస్తూ సల్మాన్ ఈ ప్రమాదం చేశారని కేసు నమోదైంది. సల్మాన్‌ను అరెస్ట్ చేసి, రక్త నమూనాలు తీసుకున్నారు. తర్వాత బెయిల్ ఇచ్చారు. ఐపీసీ, మోటార్ వెహికల్ యాక్ట్ చట్టాల క్రింద కేసు నమోదుచేశారు.
 2002, అక్టోబర్: అక్టోబర్ 7న సల్మాన్ లొంగిపోయారు. 24న బెయిల్ మంజూరైంది.
 2006: మెజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీటు
 2007 మే: ఘటన సమయంలో సల్మాన్ తాగి ఉన్నట్లు కెమికల్ అనాలసిస్ పరీక్షలో నిర్ధారణ
 2013 డిసెంబర్: కేసును ఉద్దేశపూర్వకం కానీ నేరపూరిత హత్య కేసుగా మార్చి సెషన్స్ కోర్టుకు బదిలీ చేసిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు.
 2015, మే 6: సల్మాన్‌ను దోషిగా నిర్ధారించి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై సెషన్స్ కోర్టు, బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
 2015, మే 8: తీర్పుపై సల్మాన్ దాఖలు చేసిన అపీల్‌ను విచారణకు స్వీకరించిన బొంబాయి హైకోర్టు
 సెప్టెంబర్ 21: రోజువారి విచారణను ప్రారంభించిన జస్టిస్ ఏఆర్ జోషి
 డిసెంబర్ 10: సల్మాన్‌ను నిర్దోషిగా పేర్కొంటూ తీర్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement