ముంబై: 99 శాతం వస్తువులు, సేవలను 18 శాతం లేదా అంతకంటే తక్కువ జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) పరిధిలోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ప్రధాని మోదీ మంగళవారం చెప్పారు. జీఎస్టీని అమల్లోకి తీసుకురాకముందు దేశంలో పన్ను కట్టే వాణిజ్య సంస్థలు 65 లక్షలు మాత్రమే ఉండేవనీ, ఇప్పుడు ఆ సంఖ్య మరో 55 లక్షలు పెరిగిందన్నారు. ముంబైలో జరిగిన ‘రిపబ్లిక్ సమిట్’ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ ‘ఈరోజు జీఎస్టీ పరిధి చాలా పెద్దగా ఉంది. కోటికి పైగా కంపెనీలు ఈ పన్ను వ్యవస్థ కింద నమోదై ఉన్నాయి. 99 శాతం వస్తువులు, సేవలను 18 శాతం లేదా అంతకంటే తక్కువ పన్ను పరిధిలోకి తెచ్చేందుకు మేం కృషి చేస్తున్నాం. విలాసాలకు వినియోగించే అతి కొన్ని వస్తువులపై 28 శాతం పన్ను విధిస్తాం’ అని అన్నారు. నిత్యం చర్చల ద్వారా జీఎస్టీని మెరుగుపరుస్తున్నామనీ, జీఎస్టీ విధానాలను మరింత సరళీకరించి వాణిజ్య సంస్థలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు..
వారికి శిక్ష .. ఎవరూ అనుకోలేదు
1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో దోషులకు శిక్ష పడుతుందని ఎవరూ ఊహించలేదని మోదీ అన్నారు. ఈ కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం జీవిత ఖైదు విధించడం తెలిసిందే. ‘సిక్కుల ఊచకోత బాధితులకు న్యాయం దక్కుతుందనీ, కాంగ్రెస్ నేతలకు శిక్ష పడుతుందని నాలుగేళ్ల క్రితం ఎవరూ అనుకోలేదు’ అని మోదీ పేర్కొన్నారు. చరిత్రలో తొలిసారి ఓ అవినీతి అంశం (రఫేల్ యుద్ధ విమానాలు) సుప్రీంకోర్టు వరకు వెళ్లిందనీ, తాము అంతా సక్రమంగానే చేసినట్లు కోర్టు నిర్ధారించిందని చెప్పారు.
41 వేల కోట్ల పనులకు శంకుస్థాపన
మహారాష్ట్ర పర్యటనలో ప్రధాని మొత్తం రూ. 41 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ. 33 వేల కోట్లతో ముంబై మహానగరంలో ఇళ్ల సముదాయాలు, రెండు మెట్రో రైల్ లైన్లను నిర్మించనున్నారు. ముంబై శివారులోని కళ్యాణ్‌లో రూ. 18 వేల కోట్ల వ్యయంతో నిర్మించనున్న గృహ సముదాయానికి శంకుస్థాపన చేశారు. కళ్యాణ్‌లో మోదీ మాట్లాడుతూ గత కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆదర్శ్ కుంభకోణాన్ని ప్రస్తావించారు. ఆదర్శ్ పథకం కింద పేదల కోసం కట్టిన ఇళ్ల కేటాయింపులో భారీ కుంభకోణం చోటు చేసుకోవడం తెలిసిందే. తమ ప్రభుత్వం గత ప్రభుత్వాల్లా కాకుండా నిజంగా ఆదర్శ సమాజాన్ని ఇళ్ల పథకాల ద్వారా నిర్మిస్తోందని మోదీ అన్నారు.
సభ కోసం శ్మశానం బంద్
కళ్యాణ్ ప్రాంతంలో మంగళవారం మోదీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు భద్రత కల్పించడంలో భాగంగా వేదికకు 200 మీటర్ల దూరంలో ఉన్న శ్మశానాన్ని పోలీసులు మూసేయించారు. ఖననం/దహనం చేసేందుకు మృతదేహాలను మరో శ్మశానానికి పంపారు. అలాగే మోదీ సభా వేదిక పరిసరాల్లోని మూడు పెళ్లిళ్లు రద్దయినట్లు ఓ అధికారి చెప్పారు.
బాలీవుడ్ ప్రముఖులతో మోదీ భేటీ
భారత చలనచిత్ర రంగ సమస్యలపై చర్చించేందుకు బాలీవుడ్ ప్రముఖులు మోదీని మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో కలిశారు. సినీ దర్శకుల సమాఖ్య అధ్యక్షుడు సిద్ధార్థ్ రాయ్ కపూర్, సీబీఎఫ్‌సీ చైర్మన్ ప్రసూన్ జోషి, నిర్మాతలు రితేశ్ సిధ్వానీ, కరణ్ జోహార్, నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్ తదితరులు మోదీని కలిసిన బృందంలో ఉన్నారు.
దూరంగా శివసేన..
ప్రధాని మోదీ కార్యక్రమాలకు బీజేపీ మిత్రపక్షం, మహారాష్ట్రలో ప్రధాన పార్టీ శివసేన దూరంగా ఉంది. శివసేన సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను మోదీ కార్యక్రమాలకు ఆహ్వానించలేదనీ, కాబట్టి శివసేన మంత్రులు, నేతలెవరూ ఆ కార్యక్రమాలకు వెళ్లకూడదని తాము నిర్ణయించుకున్నామని చెప్పారు. బీజేపీ, శివసేనల మధ్య విభేదాలు ఉండటం తెలిసిందే.
‘టైమ్‌లెస్ లక్ష్మణ్’ పుస్తకావిష్కరణ
ప్రముఖ దివంగత వ్యంగ్య చిత్రకారుడు, ‘కామన్ మ్యాన్’ సృష్టికర్త ఆర్కే లక్ష్మణ్ జీవితంపై రాసిన ‘టైమ్‌లెస్ లక్ష్మణ్’ పుస్తకాన్ని మోదీ ముంబైలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్, సీఎం ఫడ్నవిస్ పాల్గొన్నారు. ‘కార్టూన్ల ద్వారా గత నాలుగైదు దశాబ్దాల చరిత్రపై పరిశోధన చేయగల విశ్వవిద్యాలయం ఏదైనా ఉందేమో చూడాలని ఫడ్నవిస్‌ను నేను కోరుతున్నా. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు. కోట్లాది ప్రజలను, వారి హృదయాలను కలిపి ఉంచిన మూలాధారం వంటి వారు లక్ష్మణ్. సామాన్య, సాంఘిక శాస్త్రాల బోధనకు లక్ష్మణ్ కార్టూన్లే సులువైన మార్గం’ అని అన్నారు.
18% లేదా ఆ లోపే!
Published Wed, Dec 19 2018 3:30 AM | Last Updated on Wed, Dec 19 2018 3:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment