
అసోంలో పోటెత్తిన వరద
గువహటి : అసోంలో ఎడతెరిపిలేని వర్షాలతో వరద పోటెత్తింది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో వరద పరిస్థితితో 62,000 మందికి పైగా ప్రజలు నిర్వాసితులయ్యారు. జోర్హాట్‌లోని నిమతి వద్ద బ్రహ్మపుత్ర నది ప్రమాదస్ధాయిని మించి పొంగిపొర్లుతోంది. దెమాజి, లఖింపూర్, బిశ్వనాధ్, జోర్హాట్, గోలాఘాట్ జిల్లాల్లో వరద ప్రభావం అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు.
వరద ఉధృతితో రంగనొది హైడ్రో విద్యుత ప్రాజెక్టు నుంచి వరద నీటిని విడుదల చేయడంతో లఖింపూర్ జిల్లా నీట మునిగింది. కుండపోతతో కొండచరియలు విరిగిపడి గువహటిలో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో వరద బీభత్సం మరింత పెరిగే అవకాశం ఉందని స్కైమెట్ అంచనా వేసింది.