లంచం కొట్టా.. ఐడీ కార్డు పట్టా! | bribe given for id card | Sakshi
Sakshi News home page

లంచం కొట్టా.. ఐడీ కార్డు పట్టా!

Published Fri, Apr 3 2015 1:10 AM | Last Updated on Sat, Aug 11 2018 8:07 PM

లంచం కొట్టా.. ఐడీ కార్డు పట్టా! - Sakshi

లంచం కొట్టా.. ఐడీ కార్డు పట్టా!

డెహ్రాడూన్: అది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు శిక్షణ ఇచ్చే సంస్థ.. కట్టుదిట్టమైన భద్రత గల ఆ ప్రతిష్టాత్మక సంస్థ ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో కూడా ఉంది! అలాంటి సంస్థలోకి ఓ మహిళ.. ఐఏఎస్ ట్రెయినీనంటూ అక్రమంగా ప్రవేశించింది. ఒకట్రెండు రోజులు కాదు ఏకంగా ఆరు నెలలపాటు అందులోనే ఉండి ఇటీవలే ఉడాయించింది. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును విచారించేకొద్దీ మరిన్ని విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తనకు అకాడమీలోని ఓ డిప్యూటీ డెరైక్టరే నకిలీ ఐడీ కార్డు మంజూరు చేశారని సదరు మహిళ వెల్లడించింది. అందుకు ఆయనకు మూడు విడతల్లో రూ.5 లక్షలు లంచం ఇచ్చానంది. ఆ మహిళను ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన రూబీ చౌదరీగా గుర్తించిన పోలీసులు.. ప్రస్తుతం స్థానిక నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు.

అకాడమీలో లైబ్రేరియన్ ఉద్యోగం ఇప్పిస్తానని ఉన్నతాధికారి ఒకరు హామీ ఇచ్చారని, అందుకు రూ.20 లక్షల బేరం కూడా కుదిరిందని రూబీ తెలిపింది. ఇందులో భాగంగా ముందుగా రూ.5 లక్షలు ఇచ్చానని, మిగతా మొత్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యానని వివరించింది. మార్చి 27న అకాడమీ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని, అందుకు తనకు భారీ మొత్తంలో సొమ్ము ఇవ్వజూపారన్నారు. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు ఉత్తరాఖండ్ డీజీపీ బీఎస్ సిద్ధు.. మహిళా ఐపీఎస్ అధికారి నేతృత్వలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసినట్లు గురువారం వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement