
లక్నోలో బీఎస్పీ భారీ నిరసన
దయాశంకర్ అరెస్ట్ కోసం అల్టిమేటం
లక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత దయాశంకర్‌సింగ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వీధుల్లో వేలాది మంది పార్టీ కార్యకర్తలు గురువారం భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మరోవైపు.. బీజేపీ పార్టీ నుంచి బహిష్కరించిన దయాశంకర్ కోసం పోలీసులు లక్నో, బాలియాల్లో సోదాలు నిర్వహించారు. ఆయన కనిపించకపోవటంతో ఆయన సోదరుడు ధర్మేంద్రను అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నేత నసీరుద్దీన్ సిద్దిఖి సారథ్యంలో లక్నోలోని అత్యంత రద్దీ కూడలి హజ్రత్‌గంజ్‌లో భారీ నిరసన నిర్వహించారు. దయాశంకర్‌ను అరెస్ట్ చేయటానికి 36 గంటల సమయం ఇస్తున్నట్లు సిద్దిఖి అల్టిమేటం ఇచ్చారు.
అతడి నాలుక తెస్తే రూ. 50 లక్షలు
చండీగఢ్:మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దయాశంకర్‌సింగ్ నాలుకను తెచ్చిన వారికి రూ.50 లక్షలు బహుమతి ఇస్తానంటూ చండీగఢ్‌లో బీఎస్పీ కౌన్సిలర్ జన్నత్ జహాన్ ఉల్‌హక్ ప్రకటించారు. పార్టీ అధినేత్రిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం చేపట్టిన ప్రదర్శనలో ఆమె పై వ్యాఖ్యలతో దుమారం రేపారు.