మోదీ లక్నో సభ ఎందుకు రద్దయింది? | why BJP calls off Modi's December 24 rally in Lucknow | Sakshi
Sakshi News home page

మోదీ లక్నో సభ ఎందుకు రద్దయింది?

Published Wed, Nov 23 2016 5:38 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

మోదీ లక్నో సభ ఎందుకు రద్దయింది? - Sakshi

మోదీ లక్నో సభ ఎందుకు రద్దయింది?

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో డిసెంబర్ 24వ తేదీన భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను ఎందుకు రద్దు చేసుకున్నారు? పెద్ద నోట్ల రద్దు రేపిన దుమారాన్ని తట్టుకోవడం కష్టమనా? ప్రజలు రారని భయమా? బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సీనియర్ మంత్రులతో సమావేశమై మోదీ లక్నో బహిరంగ సభను రద్దు చేయాలని నిర్ణయించారు.
 
అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ప్రచార పర్వాన్ని తారాస్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి బీజేపీ ఈ నెల మొదట్లో నాలుగు ‘పరివర్తన్ ర్యాలీ’లను ప్రారంభించింది. ఈ నాలుగు ర్యాలీలు డిసెంబర్ 24వ తేదీన లక్నోలో కలసుకొని ముగుస్తాయి. ఈ సందర్భంగా మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. ఈ సభకు ఎంతో ప్రాముఖ్యం ఉందంటూ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టింది. అశేష జనవాహినిని సభకు తరలించాలని కూడా భావించింది. అయితే ఇటీవల గోవాలో జరిగిన మోదీ బహిరంగ సభకు ఆశించిన స్థాయిలో ప్రజలు రాకపోవడంతో పార్టీలో అసంతృప్తి వ్యక్తం అయింది.
 
దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో తలెత్తిన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు అమిష్ షా సోమవారం నాడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక కార్యదర్శి శక్తికాంత్ దాస్‌తో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఆ చర్చల్లోనే మోదీ బహిరంగ సభను వాయిదా వేయాలని అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. నోట్ల తిప్పలతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఈ సమయంలో సభను నిర్వహిస్తే మొదటికే మోసం వస్తుందని కూడా వారు అభిప్రాయపడ్డారట. నోట్ల తిప్పలు జనవరి నెల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు అరుణ్ జైట్లీ, శక్తికాంత్ సూచించారని తెలిసింది.
 
నోట్ల రద్దుపై పార్టీ ఎంపీల్లో కూడా అసంతృప్తి రగులుతోందని గ్రహించిన అమిత్ షా పార్టీ ఎంపీల సమావేశాన్ని రెండుసార్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన సమావేశంలో ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వకుండా భావోద్వేగంతో ప్రసంగించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement