'బర్త్ డేకు మా అమ్మ ఐదురూపాయలు ఇచ్చేది'
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రావడం తనకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం అత్యంత కట్టుదిట్ట భద్రత నడుమ శ్రీనగర్ చేరుకున్న ఆయన బీజేపీ-పీడీపీ ర్యాలీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేర్ ఈ కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది జమ్మూకశ్మీర్లో సంభవించిన వరదలు తనను తీవ్రంగా బాధకలిగించాయని చెప్పారు. ప్రతి పుట్టిన రోజుకు తన తల్లి రూ.5 లేదా రూ.11 ఇచ్చేదని, గతేడాది మాత్రం ఐదు వేల రూపాయలు ఇచ్చి జమ్మూకశ్మీర్ వరద బాధితులకు సహాయం చేయమని చెప్పిందని గుర్తు చేశారు.
దీపావళికి ఢిల్లీలో బంధు మిత్రులతో హాయిగా పండుగ జరుపుకోవచ్చు కానీ, తనకు మాత్రం ఈసారి కశ్మీర్ రావాలని అనిపించిందని చెప్పారు. భారత్ ఎప్పటికీ చైనాను అందుకోలేదని ప్రతి ఒక్కరూ చెప్పే వారని ఇప్పుడు మాత్రం చైనాను అందుకోవడమే కాకుండా దాని తలదన్నుతుందని కూడా చెప్తున్నారని అన్నారు. భారత్లోని ప్రతిప్రాంతాన్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలన్నదే తమ అభిమతనం అని చెప్పారు.