calls off
-
పాపం ముర్డోచ్ ఐదో పెళ్లి ఆగిపోయింది..
92 ఏళ్ల రూపెర్ట్ ముర్డోచ్, 66 ఏళ్ల ఆన్ లెస్లీ స్మిత్‌ల ప్రేమ కథ ముగిసిపోయింది. మతాల కారణంగా వారి నిశ్చితార్థం ఆగిపోయింది. ఇటీవలే ప్రేమలో పడిన ఆ వృద్ధ ప్రేమికుల పెళ్లికి అడ్డంకులు తప్పలేదు. వచ్చే వేసవి పెళ్లి చేసుకోవాలని భావించిన ఆ జంట నిశ్చితార్థం కూడా కాకుండానే విడిపోయింది. రూపెర్ట్ ముర్డోచ్ ప్రముఖ మీడియా సంస్థల అధినేత. ఫాక్స్ న్యూస్, న్యూస్ కార్ప్, స్కై న్యూస్ వంటి వార్తా సంస్థలను ఆయన స్థాపించారు. ఇక ఆన్ లెస్లీ స్మిత్ రేడియో హోస్ట్, మాజీ దంత వైద్యురాలు. వానిటీ ఫెయిర్ పత్రిక కథనం ప్రకారం.. స్మిత్ అవలంభిస్తున్న మతాచారాలతో ముర్డోచ్‌కు పొసగడం లేదు. దీంతో ఆమెతో ప్రేమకు స్వస్తి చెప్పి నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. వీరి ప్రేమాయణం 2022 సెప్టెంబర్ లో ప్రారంభమైంది. తన నాల్గవ భార్య జెర్రీ హాల్ నుంచి విడాకులు తీసుకున్న వెంటనే ముర్డోచ్ 2023 మార్చిలో స్మిత్‌తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించాడు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమలో పడటానికి భయపడ్డాను కానీ ఇది తన చివరి ప్రేమ అని ముర్డోచ్ తన యాజమాన్యంలోని న్యూయార్క్ పోస్ట్‌తో అప్పట్లో చెప్పారు. సెయింట్ పాట్రిక్స్ డే రోజున తాను స్మిత్‌కు ప్రపోజ్ చేశానని, ఆ సందర్భం తనను ఆందోళనకు గురి చేసిందని కూడా పేర్కొన్నారు. ఈ జంట జనవరిలో బార్బడోస్‌లో హాలిడేలో కనిపించారు. స్మిత్ సముద్రం నుంచి షర్ట్‌లెస్ ముర్డోచ్కి సహాయం చేస్తున్నట్లు ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఫిబ్రవరిలో ముర్డోచ్ సెంట్రల్ పార్క్ సౌత్‌లో 30 మిలియన్ డాలర్లు, 6,500 చదరపు అడుగుల భారీ నివాసాన్ని కొనుగోలు చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. -
సరైన సమయం కాదు.. అందుకే రూ. 20,000 కోట్ల ఎఫ్‌పీవోను వెనక్కి ఇస్తున్నాం: అదానీ గ్రూప్
ముంబై: ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) పూర్తిగా సబ్స్క్రయిబ్ అయినప్పటికీ ఇష్యూను ఉపసంహరించుకోవాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది. ప్రస్తుతం అసాధారణ పరిస్థితులు, మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. ఎఫ్‌పీవో ద్వారా సేకరించిన నిధులను ఇన్వెస్టర్లకు తిరిగి ఇవ్వనున్నట్లు సంస్థ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. తమ బ్యాలెన్స్ షీట్ పటిష్టంగానే ఉందని, రుణాల తిరిగి చెల్లింపుల్లో మంచి ట్రాక్ రికార్డు ఉందని పేర్కొన్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ రూ. 20,000 కోట్ల ఎఫ్‌పీవో జనవరి 31న ముగిసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టుతో బుధవారం కూడా గ్రూప్ సంస్థల షేర్లు భారీగా నష్టపోయిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. చదవండి: Union Budget 2023: ఇళ్ల కొనుగోలుదారులకు శుభవార్త.. ఆ పథకానికి భారీగా నిధులు పెంపు! -
అన్నా హజారే దీక్ష విరమణ
రాలేగావ్ సిద్ధి(మహారాష్ట్ర) : అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త అన్నా హజారే మంగళవారం దీక్షను విరమించారు. తన డిమాండ్లను నెరవేర్చేందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇచ్చిన హామీతో దీక్ష విరమిస్తున్నట్టు అన్నా హజారే ప్రకటించారు. లోకాయుక్త నియామకంపై ఫిబ్రవరి 13న మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని దీక్ష విరమణ అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ హజారే వెల్లడించారు. సీఎంతో చర్చలు సంతృప్తికరంగా సాగడంతో తాను సంతోషంగా దీక్ష విరమిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. లోక్‌పాల్ అమలు చేయాలన్న తమ ప్రధాన డిమాండ్‌కు సానుకూలంగా స్పందించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ దిశగా ఈనెల 13న నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. లోకాయుక్త కోసం జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తారని, రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకువస్తారని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం స్వయంగా అన్నా హజారే స్వగ్రామం రాలేగావ్ సిద్ధి గ్రామానికి చేరుకుని ఆయనతో సంప్రదింపులు జరిపారు. కేంద్ర స్ధాయిలో లోక్‌పాల్, రాష్ట్రాల పరిదిలో లోకాయుక్తలను ఏర్పాటు చేయాలని అన్నా హజారే చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
మోదీ లక్నో సభ ఎందుకు రద్దయింది?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో డిసెంబర్ 24వ తేదీన భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభను ఎందుకు రద్దు చేసుకున్నారు? పెద్ద నోట్ల రద్దు రేపిన దుమారాన్ని తట్టుకోవడం కష్టమనా? ప్రజలు రారని భయమా? బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సీనియర్ మంత్రులతో సమావేశమై మోదీ లక్నో బహిరంగ సభను రద్దు చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్‌లో పార్టీ ప్రచార పర్వాన్ని తారాస్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి బీజేపీ ఈ నెల మొదట్లో నాలుగు ‘పరివర్తన్ ర్యాలీ’లను ప్రారంభించింది. ఈ నాలుగు ర్యాలీలు డిసెంబర్ 24వ తేదీన లక్నోలో కలసుకొని ముగుస్తాయి. ఈ సందర్భంగా మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. ఈ సభకు ఎంతో ప్రాముఖ్యం ఉందంటూ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టింది. అశేష జనవాహినిని సభకు తరలించాలని కూడా భావించింది. అయితే ఇటీవల గోవాలో జరిగిన మోదీ బహిరంగ సభకు ఆశించిన స్థాయిలో ప్రజలు రాకపోవడంతో పార్టీలో అసంతృప్తి వ్యక్తం అయింది. దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో తలెత్తిన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు అమిష్ షా సోమవారం నాడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆర్థిక కార్యదర్శి శక్తికాంత్ దాస్‌తో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఆ చర్చల్లోనే మోదీ బహిరంగ సభను వాయిదా వేయాలని అభిప్రాయపడినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. నోట్ల తిప్పలతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఈ సమయంలో సభను నిర్వహిస్తే మొదటికే మోసం వస్తుందని కూడా వారు అభిప్రాయపడ్డారట. నోట్ల తిప్పలు జనవరి నెల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు అరుణ్ జైట్లీ, శక్తికాంత్ సూచించారని తెలిసింది. నోట్ల రద్దుపై పార్టీ ఎంపీల్లో కూడా అసంతృప్తి రగులుతోందని గ్రహించిన అమిత్ షా పార్టీ ఎంపీల సమావేశాన్ని రెండుసార్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన సమావేశంలో ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేయడానికి అవకాశం ఇవ్వకుండా భావోద్వేగంతో ప్రసంగించారు. -
తలైవా జన్మదిన వేడుకలు వద్దన్నారు
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ తన పుట్టిన రోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈసారి అభిమానులు ఎవరూ కూడా తన జన్మదిన వేడుకలను జరపవద్దని, ఆ మేరకు ఎవరైనా ప్రణాళికలు వేసుకుని ఉంటే వాటిని వెంటనే విరమించుకోవాలని చెప్పారు. తమిళనాడులో భారీ వర్షాలకారణంగా వరదలు పోటెత్తి చెన్నైతోపాటు పలు ప్రాంతాలు నీటిలో మునిగిపోయిన విషయం తెలిసిందే. పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి కూడా. ఇలాంటి పరిస్థితులు ఉండగా ప్రస్తుతం జన్మదిన వేడుకల హడావుడి వద్దని, తన అభిమానులంతా కలిసి వరదలకు గురైనవారికి, ప్రాంతాలకు సహాయం చేయాలని కోరారు. చెన్నై మొత్తం కన్నీరుమున్నీరుగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తనకు జన్మదిన వేడుకలకన్నా వారికి సహాయం చేయడమే ముఖ్యమని రజనీకాంత్ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత 63 ఏళ్ల వయసున్న రజనీకాంత్ ఈ వచ్చే శనివారం 64వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.