భద్రతాదళాల కాల్పులు: వర్ధమాన క్రికెటర్ మృతి
శ్రీనగర్: ఉత్తర కశ్మీర్లో ఆందోళనకారులపై ఆర్మీ జవాన్లు జరిపిన కాల్పుల్లో ఓ వర్ధమాన క్రికెటర్తో పాటూ మరో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన హంద్వారాలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. హంద్వారా గవర్నమెంట్ కళాశాలకు చెందిన నయీం అనే వర్ధమాన క్రికెటర్ కాల్పుల్లో మృతిచెందాడు. మూడేళ్ల కింద జాతీయ స్థాయిలో అండర్19 జట్టులో నయీం ఆడాడని అతని స్నేహితుడు తెలిపాడు.
కళాశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఓ విద్యార్థిని పట్ల జవాన్లు అసభ్యంగా ప్రవర్తించారంటూ స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి ఆందోళన చేశారు. అయితే ఆందోళనకారులు ముందుగా తమపై రాళ్లు రువ్వడంతో కాల్పులు జరిపారని జవాన్లు తెలిపారు. ఈ కాల్పుల్లో.. ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు.
ఈ సంఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం పై ఆర్మీ అధికారులు ఒక ప్రకటన ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులైన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నయీం ఇటీవల జరిగిన ఓ టోర్నమెంట్కుముందు పోలీసు అధికారితో కరచాలనం చేస్తున్న ఫోటోను అతని అభిమానులు, స్నేహితులు సోషల్ మీడియాలో షేర్లమీద షేర్లు చేస్తున్నారు.