
డిజిటల్ చెల్లింపులకు బంపర్ డ్రా
లక్కీ గ్రాహక్ యోజన, డిజి–ధన్ వ్యాపార్ యోజనల్లో బహుమతుల వర్షం
రోజూ 15 వేల మంది వినియోగదారులకు రూ.1000 చొప్పున బహుమతులు
న్యూఢిల్లీ: దేశ ప్రజల్ని డిజిటల్ వైపు మళ్లించేం దుకు కేంద్రం గురువారం మరో కీలక నిర్ణయం ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులు చేస్తే బంపర్ డ్రాలు, మెగా డ్రాల రూపంలో వినియోగదారులు, వ్యాపారులకు భారీ ప్రో త్సాహకాలు అందించనున్నట్లు తెలిపింది. క్రిస్మస్ నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం కోసం రూ.340 కోట్ల మొత్తాన్ని వెచ్చిస్తున్నట్లు పే ర్కొంది. ఈ మేరకు వినియోగదారుల కోసం ‘లక్కీ గ్రాహక్ యోజన’, వ్యాపారుల కోసం ‘డిజి ధన్ వ్యాపార్ యోజన’లను డిసెంబర్ 25 నుంచి ప్రారంభిస్తున్నామని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తెలిపారు. రూ. 50 నుంచి రూ. 3వేల మధ్య డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తే లక్కీడ్రా నిర్వహించి బహుమతులు అందిస్తామన్నారు.
దేశానికి ఇది క్రిస్మస్ కానుక అని, డిసెంబర్ 25న మొదటి డ్రా, అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న మెగా డ్రా నిర్వహిస్తామని కాంత్ వెల్లడించారు. అవార్డుల కోసం డిజిటల్ చెల్లింపుల ఐడీల్లో కొన్నింటిని డ్రా ద్వారా ఎంపిక చేస్తారని, యూపీఐ, యూఎస్‌ఎస్‌డీ, ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ(ఏఈపీఎస్) ద్వారా జరిపిన కార్యకలాపాలు, రూపే కార్డులు లక్కీ డ్రాకు అర్హమని తెలిపారు. ప్రైవేట్ క్రెడిట్ కార్డులు, ప్రైవేటు కంపెనీల ఈ–వాలెట్ల ద్వారా చేసే కార్యకలాపాలకు ఈ పథకాలు వర్తించవని చెప్పారు. పేద, మధ్య తరగతి, చిన్న వ్యాపారుల్ని డిజిటల్ చెల్లిం పుల విప్లవంలో భాగస్వాములు చేసేందుకు వీటిని ప్రారంభిస్తున్నట్లు కాంత్ పేర్కొన్నారు.
2, 3 వారాల్లో 50 శాతం కొత్త కరెన్సీ
వచ్చే 2–3 వారాల్లో కొత్త కరెన్సీ నోట్ల పంపిణీ గణనీయంగా పెరుగుతుందని ఆర్థిక శాఖ వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ గురువారం తెలిపారు. ఇంతవరకూ రూ. 5 లక్షల కోట్ల మేర రూ. 500, రూ. 2 వేల నోట్లు చెలామణీలోకి వచ్చాయని, నెలాఖరుకు రూ.15 లక్షల కోట్ల(రదై్దన నోట్ల మొత్తం)లో 50 శాతం చలామణీలోకి వస్తాయని చెప్పారు. రదై్దన నోట్ల డిపాజిట్ల వివరాల్ని మరోసారి పరిశీలించుకోవాలని, రెండు సార్లు లెక్కించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్‌బీఐ, బ్యాంకులకు సూచించినట్లు దాస్ చెప్పారు. రూ. 500 నోట్ల ముద్రణ, సరఫరా వేగవంతం చేశామని, 2 లక్షల ఏటీఎంల్లో కొత్త నోట్లకు అనుగుణంగా మార్పులు చేశామని ఆయన వెలడించారు.
80% వస్తే ఆంక్షల సడలింపు!
కొత్త కరెన్సీ 80 శాతం చలామణిలోకి వస్తే నగదు ఉపసంహరణలపై ఆంక్షలు సడలించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ముందుగా సహకార బ్యాంకుల్లో, అనంతరం అన్ని వాణిజ్య బ్యాంకుల్లో ఆంక్షలు సడలిస్తామని చెప్పారు. పన్ను చెల్లింపులు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వ చెల్లింపులపై రద్దు చేసిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)ను బ్యాంకులకు రీఇంబర్స్ చేసేందుకు బడ్జెట్‌లో తగిన ఏర్పాట్లు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఎండీఆర్ చార్జీల కోసం బ్యాంకులు తమ క్లెయింలు ఆర్‌బీఐకు సమర్పించాలని సూచించింది.
పరిమిత నగదు వ్యవస్థే లక్ష్యం: జైట్లీ
డిజిటల్ కార్యకలాపాల వ్యయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు చర్యలు తీసుకుంటున్నాయని, పరిమిత నగదు ఆర్థిక వ్యవస్థే తమ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. నగదు కార్యకలాపాలకు డిజిటల్ వ్యవహారాలు ప్రత్యామ్నాయం కాదని, ఇవి రెండూ సమాంతరంగా కొనసాగుతాయని చెప్పారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అంటే పరిమిత నగదు ఆధారిత వ్యవస్థ అని... ఏ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నగదు రహితం కాదన్నారు. ముంబైలో రూ. 10 కోట్ల స్వాధీనం ముంబై శివారు చెంబూరులో పోలీసులు ఒక వాహనం నుంచి రూ.10.10 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 10 కోట్లు రద్దైన 500 నోట్లు కాగా, రూ. 10 లక్షల విలువైన రూ. 2వేల నోట్లు దొరికాయని పోలీసులు తెలిపారు. పుణే జిల్లాలోని వైద్యనాథ్ అర్బన్ సహకార బ్యాంకు నుంచి నగదును పుణేకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు.
క్రిస్మస్ కానుక: మోదీ
లక్కీ గ్రాహక్ యోజ న, డిజి–ధన్ వ్యాపా ర్ యోజనలు క్రిస్మస్ కానుకలని, డిజిటల్ చెల్లింపులకు ఇవి సాయపడే ప్రోత్సాహకాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. నగదురహిత లావాదేవీలను పెంచే దిశగా ఈ పథకాల ప్రకటన వ్యూహాత్మక అడుగని, నగదురహిత, అవినీతి రహిత భారతం సాధించేందుకివి ఊతమిస్తాయన్నారు.
‘యాక్సిస్’లో 60 కోట్ల అక్రమ నగదు
నోట్ల రద్దు అనంతరం యాక్సిస్ బ్యాంకు బ్రాంచీల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నోయిడాలోని సెక్టార్ 51 యాక్సిస్ బ్యాంక్ శాఖలో 20 షెల్ కంపెనీలకు చెందిన రూ. 60 కోట్ల నగదును ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. షెల్ కంపెనీల డైరెక్టర్లు ఎవరనే కోణంలో విచారణ చేపట్టారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ. 600 కోట్ల విలువైన బంగారం కడ్డీల్ని నోయిడాలోని ఒక జ్యువెలరీ షాపు అమ్మిన కేసు విచారణలో భాగంగా ఈ వివరాలు వెలుగు చూశాయి. నోయిడా బ్రాంచ్‌లో బంగారం దుకాణానికి ఖాతాలున్నట్లు గుర్తించి విచారణ కొనసాగించడంతో షెల్ కంపెనీల బాగోతం బయటపడింది. ఇంతవరకూ దేశవ్యాప్తంగా యాక్సిస్ బ్యాంకుల్లో అక్రమాలపై 24 మంది ఉద్యోగుల్ని సస్పెండ్ చేశామని, 50 ఖాతాల్ని నిలిపివేశామని ఆ బ్యాంకు ప్రకటించింది.
వినియోగదారులు, వ్యాపారులకు వేర్వేరుగా...
లక్కీ గ్రాహక్ యోజన: డిసెంబర్ 25 నుంచి 100 రోజుల పాటు(ఏప్రిల్ 14 వరకూ) రోజు 15 వేల మంది వినియోగదారులకు రూ.1000 చొప్పున నగదు ప్రోత్సహకం అందిస్తారు. వారానికోసారి రూ. లక్ష, రూ.10 వేలు, రూ. 5 వేల చొప్పున 7 వేల మందికి అవార్డులిస్తారు. మెగా అవార్డు కింద ఏప్రిల్ 14న రూ. కోటి, రూ. 50 లక్షలు, రూ. 25 లక్షలు ఇస్తారు.
డిజి–ధన్ యోజన: వారానికోసారి 7 వేల మంది వ్యాపారులకు రూ. 50,000, రూ. 5 వేలు, రూ. 2,500ల చొప్పున అవార్డులతో పాటు ఏప్రిల్ 14న వ్యాపారుల కోసం మెగా డ్రాలో రూ. 50 లక్షలు, రూ. 25 లక్షలు, రూ. 5 లక్షలు ఇస్తారు.