దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉప ఎన్నికల కౌంటింగ్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 3 లోక్‌సభ, 33 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ లోక్‌సభతో పాటు వడోదర, మెయిన్‌పురి పార్లమెంట్ ఫలితాలు మధ్యాహ్నానికి వెలువడతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా నందిగామ అసెంబ్లీ ఫలితాలు ఉదయం 11 గంటలలోపే తెలిసే అవకాశముంది. టీఆర్ఎస్ తరపున ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి జగ్గారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు.
ఇక మెదక్ లోక్సభ ఓట్ల లెక్కింపుకు సంబంధించి 14 రౌండ్లలో పూర్తి అవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. మెదక్ జిల్లా పటాన్‌చెరు మండలంలోని గీతం విశ్వవిద్యాలయంలో ఈ లెక్కింపు కొనసాగుతోంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. 121 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లు, 120 మంది కౌంటింగ్ అసిస్టెంట్ల్లు లెక్కింపులో పాల్గొన్నారు.
నందిగామ ఉపఎన్నిక ఫలితాలు
కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జరుగుతోంది.. టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కుమార్తె సౌమ్య టీడీపీ అభ్యర్థిగా పోటీచేశారు. మానవీయ దృక్పథంతో, గత సంప్రదాయాలకు అనుగుణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అభ్యర్థిని నిలుపలేదు. కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబూరావు పోటీలో ఉన్నప్పటికీ నామమాత్రమే.