
టెకీకి ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం
తన సొంత మావయ్య ఆరోగ్యం విషమించడంతో చూసేందుకు వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు మంగళూరు ఎయిర్ పోర్ట్ లోచేదు అనుభవం ఎదురైంది.
మంగళూరు: తన సొంత మావయ్య ఆరోగ్యం విషమించడంతో చూసేందుకు వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు మంగళూరు ఎయిర్ పోర్ట్ లోచేదు అనుభవం ఎదురైంది. గత శుక్రవారం బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఓ యువతి మంగళూరు ఎయిర్ పోర్ట్ లో దిగింది. అయితే అక్కడ స్థానిక క్యాబ్ డ్రైవర్లు ఆమెకు చుక్కలు చూపించారు.
ముందుగానే ఆమె ఓలా క్యాబ్ ను బుక్ చేసుకున్నా.. ఆ క్యాబ్ సర్వీస్ ను ఎయిర్ పోర్ట్ లో రాకుండా క్యాబ్ డ్రైవర్లు అడ్డుకుని ఆమెను చిత్ర హింసలకు గురిచేశారు. తమ క్యాబ్ లో నే రావాలంటూ ఆమెపై వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై ఆదివారం మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
'నేను బుక్ చేసుకున్న క్యాబ్ దగ్గరకు చేరే క్రమంలో ఎయిర్ పోర్ట్ క్యాబ్ డ్రైవర్లు నన్ను చుట్టుముట్టారు. ఓలా క్యాబ్ డ్రైవర్ వద్ద నుంచి కారు తాళాలు కూడా లాక్కున్నారు. ఆ తాళాలను తిరిగి తీసుకోవడానికి ఆ డ్రైవర్ వారిని ప్రాధేయపడాల్సి వచ్చింది. ఆ సమయంలో భయపడిపోయా. చివరకు నా భర్తకు కాల్ చేశా. ఓలా డ్రైవర్ ను బయటే ఉండమని చెప్పి మేము నడుచుకుంటూ బయల్దేరాం. అయినా రెండు క్యాబ్ ల్లో ఇద్దరు డ్రైవర్లు మాత్రం మమ్మల్ని అనుసరించి తీవ్రంగా వేధించారు. ఇక చేసేది లేక చివరకు ఆటోలోనే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది' అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తాను ఇంటికి వెళ్లే సరికి మావయ్య మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేసింది.