‘కెమెరా’ నిందితులకు బెయిల్
పణజి: గోవాలోని ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణంలో రహస్య కెమెరాల కేసులో అరెస్టయిన నలుగురు నిందితులకు ఇక్కడి స్థానిక కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు సరైన కారణాలు చూపనందున వారికి బెయిల్ ఇచ్చినట్లు పేర్కొంది.
శుక్రవారం ఈ షాపులో వస్త్రాలు మార్చుకునే ట్రయల్ రూంలో రహస్య కెమెరా ఉన్నట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గుర్తించడం, ఆ వెంటనే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఫిర్యాదుపై పోలీసులు నలుగురు సిబ్బందిని అరెస్ట్ చేయడం తెలిసిందే. వారిపై ఐపీసీ 354సి (రహస్యంగా చూడడం), 509(వ్యక్తిగత విషయాల్లోకి చొరబడడం)తోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఇ కింద కేసులు పెట్టారు. పరారీలో ఉన్న షాపు మేనేజర్ చైత్రాలి సావంతాస్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా లాయర్ ద్వారా గోవా కోర్టును ఆశ్రయించారు.
రహస్య కెమెరాలు లేవు: ఫ్యాబ్ ఇండియా
స్మృతి ఇరానీ వెళ్లిన షాపు సహా తమ దుకాణాల్లో ఎక్కడా రహస్య కెమెరాలు లేవని ఫ్యాబ్ ఇండియా పేర్కొంది. మంత్రి గుర్తించిన కెమెరా నిఘా కెమెరానే కానీ రహస్య కెమెరా కాదని తెలిపింది. తమకు మహిళ పట్ల అపార గౌరవం ఉందని, మంత్రి ఇబ్బందికి గురైనట్లయితే క్షమాపణ కోరుతున్నట్లు పేర్కొంది.
మహారాష్ట్రలో మరో కేసు.. మహారాష్ట్రలో కొల్హాపూర్‌లోని ఫ్యాబ్‌ఇండియా షాపులో మార్చి 31న కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఓ మహిళ దుస్తులు మార్చుకుంటున్న సమయంలో కెమెరాలో చిత్రీకరించేందుకు షాపులో పనిచేసే ఇస్పుర్లే అనే వ్యక్తి యత్నించాడని తెలిపారు. ఈ విషయాన్ని సదరు మహిళ ఆమె గుర్తించి ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు.