స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు జైరాం రమేశ్, పవన్ ఖేరా, నెటా డిసౌజాకు లీగల్ నోటీసులు పంపారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. గోవాలో తన కూతురు అక్రమంగా బార్ నడుపుతోందని నిరాధార ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. తన ప్రతిష్టను మసకబార్చేందుకే కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.
18 ఏళ్ల తన కూతురు గోవాలో రెస్టారెంట్ కోసం, బార్ కోసం ఎలాంటి దరఖాస్తులు చేయలేదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. తన కూతురుకు ఎక్సైజ్ శాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు కూడా రాలేదని చెప్పారు. కాంగ్రెస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందన్నారు.
స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీకి గోవాలో రెస్టారెంట్ ఉందని, అందులో అక్రమంగా బార్ కూడా నడుస్తోందని కాంగ్రెస్ నేతలు శనివారం ఆరోపించడం తీవ్ర దుమారం రేపింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన స్మృతి ఇరానీ వీటిని కొట్టిపారేశారు. తాను గాంధీలను విమర్శిస్తున్నందుకే తన కూతుర్ని లక్ష‍్యంగా చేసుకున్నారని ఎమోషనల్ అయ్యారు.
మరోవైపు కాంగ్రెస్ మాత్రం జోయిష్ ఇరానీపై చేసిన ఆరోపణలను సమర్థించుకుంది. సాక్ష‍్యంగా చూపుతూ ట్విట్టర్‌లో వీడియో కూడా షేర్ చేసింది. అంతేకాదు ఆదివారం గోవాలోని జోయిష్ ఇరానీదే అని ఆరోపిస్తున్న రెస్టారెంట్ ముందు నిరసన కూడా చేపట్టింది.
చదవండి: 'ఆ రెస్టారెంట్ స్మృతి ఇరానీ కూతురిదే.. ఇదిగో సాక్ష్యం'
Comments
Please login to add a commentAdd a comment