
లక్నో : అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల పట్ల సానుభూతి చూపాల్సింది పోయి వారిని చితక్కొట్టారు ఆస్పత్రి సిబ్బంది. స్టాఫ్ టాయిలెట్స్ వాడినందుకు గాను క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళను దారుణంగా అవమానించడమే కాక ఆమె కుమారుడి మీద కూడా దాచి చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ(కేజీఎంయూ)లో జరిగిందీ దారుణం. స్టాఫ్ టాయిలెట్స్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిందన్న కారణంతో ఓ క్యాన్సర్ పేషెంట్ పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడమే కాక ఆమె కొడుకుపై కూడా దాడికి పాల్పడ్డారు సదరు ఆస్పత్రి సిబ్బంది.
గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఈ దాడి ఘటనపై ఔట్ పేషెంట్ ఇన్‌చార్జి ప్రొ.మనీష్ బాజ్‌పాయి సీరియస్ అయ్యారు. యువకుడిపై దాడి చేసిన ముగ్గురు సిబ్బందిని గుర్తించి.. వారిని విధుల నుంచి తొలగించారు. ఇక మీదట ఇలాంటి గొడవలు జరగకుండా చూస్తామని తెలిపారు.