లైవ్ ఆపరేషన్ లో పేషెంట్ మృతి
లైవ్ ఆపరేషన్ లో పేషెంట్ మృతి
Published Mon, Aug 10 2015 10:59 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. లాప్రోస్కోపిక్ అపరేషన్ గురించి మెడికల్ విద్యార్థులకు అవగాహన కల్పించే వర్క్షాపులో అపశృతి దొర్లింది. లైవ్ ఆపరేషన్ వికటించి ఓ క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు మరణించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో క్యాన్సర్తో బాధపడుతున్న శోభారాం (62) దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. అనేక మంది నిపుణులైన డాక్టర్ల సమక్షంలో ఆ దుర్ఘటన చోటు చేసుకోవడంతో మృతుని బంధువులు ఆందోళనకు దిగారు.
వివరాల్లోకి వెడితే.. లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న శోభా రాంను జీబి పంత్ ప్రభుత్వం ఆసుపత్రి వర్గాలు ఎయిమ్స్ కు రిఫర్ చేశారు. దీంతో లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా అతని శరీరంలోని కణితిని తొలగించేందుకు ఎయిమ్స్ వైద్యులు నిర్ణయించారు. ఈ ప్రక్రియను లైవ్ సెమినార్ ద్వారా విద్యార్థులకు బోధించేందుకు సిద్ధమయ్యారు. దీనిమూలంగా ఆపరేషన్కు ఎక్కువ సమయం పట్టింది. ఫలితంగా తీవ్ర రక్తం స్రావం అయింది. దీంతో ఖంగారుపడిన వైద్యులు, లాప్ ద్వారా, కాకుండా ఓపెన్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో శోభా రాం ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. సుదీర్ఘ అనుభవం ఉన్న వైద్య నిపుణుల ఆధ్వర్యంలోనే ఇలా జరగడంతో ఆందోళన చెలరేగింది.
లైవ్ మెడికల్ సెమినార్ పేరుతో తమ బంధువుని బలితీసుకున్నారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సుమారు నాలుగు గంటల పాటు కాలయాపన చేశారన్నారు. విద్యార్థులకు బోధించే పేరుతో ఎక్కువ సేపు ఆపరేషన్ నిర్వహించడం వల్లనే తీవ్ర రక్తస్రావమైం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి దాటిపోతున్నా చూస్తూ ఊరుకున్నారని మండిపడ్డారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేయనున్నామని తెలిపారు.
అయితే ఈ ఆరోపణలతో ఎయిమ్స్ డాక్టర్లు విభేదిస్తున్నారు. వ్యాధి తీవ్రంగా చనిపోయాడు తప్ప, ఆపరేషన్ విధానంలో పొరపాటు వల్లకాదని స్పష్టం చేశారు. సీనియర్ల డాక్టర్లందరూ అతణ్ని కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించారని ఆసుపత్రి పీనియర్ వైద్యులు తెలిపారు.
Advertisement