అగ్ని-5 సక్సెస్..
బాలసోర్: ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-5’ను సైన్యం మొబైల్ లాంచర్ నుంచి శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ఒక టన్ను బరువుగల అణ్వస్త్రాన్ని మోసుకుపోగల దీన్ని మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి. ఒడిశాలో వీలర్ ఐలాండ్స్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి శనివారం ఉదయం 8.06 గంటలకు ‘అగ్ని-5’ను ప్రయోగించినట్లు ఐటీఆర్ డెరైక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ వెల్లడించారు. ఎక్కడికైనా సులువుగా తరలించగలిగే మొబైల్ లాంచర్ నుంచి దీన్ని విజయవంతంగా ప్రయోగించామని తెలిపారు.
క్షిపణిని ప్రయోగానికి సిద్ధం చేయడానికి అతితక్కువ సమయం సరిపోతుందని, నిర్వహణ వ్యయం, శ్రమ తగ్గుతుందని చెప్పారు. బంగాళాఖాతం మధ్యలో ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించిందని.. దానికి కొంత దూరంలో సిద్ధంగా ఉన్న నౌకల్లోని సిబ్బంది దీనిని ప్రత్యక్షంగా వీక్షించారని ఈ మిషన్ డెరైక్టర్ వి.జి.శేఖరన్ చెప్పారు. రాడార్లు, పరిశీలక వ్యవస్థల ద్వారా క్షిపణి ప్రయాణ మార్గాన్ని, దాని పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించామన్నారు. మొబైల్ లాంచర్ నుంచి అగ్ని-5 క్షిపణి ప్రయోగం మన వ్యూహాత్మక దాడి సామర్థ్యాన్ని మరింత పెంపొందిస్తుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా క్షిపణులను ఒకే చోట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాశ్వత ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగిస్తారని.. దానిని సులువుగా గుర్తించడంతో పాటు శత్రువులు దాడి చేసేందుకు అవకాశముంటుందని అంటున్నారు. అదే మొబైల్ లాంచర్ వెర్షన్‌ను రహస్యంగా తరలించి, ప్రయోగించవచ్చంటున్నారు.
అభినందనలు.. అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో పాలుపంచుకున్న వారందరికీ దేశం రుణపడి ఉంటుందనిడీఆర్‌డీవో డీజీ అవినాశ్ చందర్‌కు పంపిన సందేశంలో రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ విజయం కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నానని మోదీ పేర్కొన్నారు.
అగ్ని-5 ప్రత్యేకతలు..
5 వేల కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాంతర్గత బాలిస్టిక్ క్షిపణి ఇది.
డీఆర్‌డీవో ఆధ్వర్యంలో దీనిని అభివృద్ధి చేశారు.
బరువు 50 టన్నులు... పొడవు 17 మీటర్లు, వెడల్పు 2 మీటర్లు.
1000 కిలోలకుపైగా బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు.
మూడు దశల్లో ఘన ఇంధనాన్ని వినియోగించుకుని మాక్-24 వేగంతో (ధ్వని వేగానికి 24 రెట్లు.. అంటే దాదాపు గంటకు 30 వేల కిలోమీటర్ల వేగం) దూసుకెళుతుంది.
భూ ఉపరితలం నుంచి ఆకాశంలోకి దాదాపు 600 కిలోమీటర్ల ఎత్తువరకు వెళ్లి... ఆ తర్వాత లక్ష్యం దిశగా దూసుకెళుతుంది.
క్షిపణిలో ఏర్పాటు చేసిన ఆన్‌బోర్డు కంప్యూటర్, లేజర్ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ సహాయంతో ప్రయాణించి... లక్ష్యాన్ని ఢీకొడుతుంది.
భూవాతావరణంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో క్షిపణిపై కవచం ఉష్ణోగ్రత దాదాపు 4,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. కానీ లోపల పరికరాలు, వ్యవస్థల ఉష్ణోగ్రత మాత్రం 50 సెంటీగ్రేడ్‌ల లోపే ఉండేలా ఏర్పాట్లు చేశారు.
ఇంతకు ముందే రెండు సార్లు సాధారణ లాంచర్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు కూడా.
మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి.
విజయంతో ఘనంగా వీడ్కోలు
మొబైల్ లాంచర్ నుంచి సైతం అగ్ని-5 ఖండాంతర క్షిపణి తొలి సారిగా సత్తా చాటడంతో డీఆర్‌డీవో చీఫ్‌గా అవినాశ్ చందర్‌కు ఘనంగా వీడ్కోలు లభిం చినట్లయింది. డీఆర్‌డీవో చీఫ్‌గా శనివారం పదవి నుంచి ఆయన ఈ చివరి విజయంతో సంతృప్తిగా వైదొలిగారు. ‘డీఆర్‌డీవోలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదించాను. సంస్థ విజయాల్లో నాకు మద్దతుగా నిలిచినవారందరికీ ధన్యవాదాలు. దేశానికి అధునాతన క్షిపణులను అందించగలిగినందుకు తృప్తితో వీడ్కోలు తీసుకుంటున్నా’ అని చందర్ అన్నారు. అగ్ని, ఇతర క్షిపణుల అభివృద్ధిలో విశేష కృషి చేసిన ‘అగ్ని మ్యాన్’గా పేరు తెచ్చుకున్న చందర్ కాంట్రాక్టును 15 నెలలు ముందుగానే కేంద్రం రద్దుచేయడం తెలిసిందే. డీఆర్‌డీవో బాధ్యతలను రక్షణ కార్యదర్శి ఆర్‌కే మాథుర్‌కు అదనంగా కేంద్రం అప్పగించింది.