రజనీకాంత్ వర్సెస్ విజయ్‌కాంత్!
వేడెక్కిన తమిళ రాజకీయాలు
సినీ స్టార్ల చుట్టూ చక్కర్లు తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఉద్దేశించి కెప్టెన్ విజయ్‌కాంత్ చేసిన వ్యాఖ్యలు.. రజనీ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. 'కెప్టెన్' తీరుపై 'తలైవా' ఫ్యాన్స్ త్రీవస్థాయిలో మండిపడుతున్నారు.
డీఎండీకే అధినేత అయిన విజయ్‌కాంత్ గత శుక్రవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ.. రజనీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ భయపడబోనని, ప్రత్యర్థి పార్టీలు బెదిరించినంతమాత్రాన రజనీకాంత్‌లాగా తాను రాజకీయాల నుంచి పారిపోబోనని పేర్కొన్నారు. రజనీ తమిళ మూలాలపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. 'మీరు ఆయనను తమిళియన్ అంటారు. కానీ ఆయన సినిమాలను ఎవరు సెన్సార్ చేస్తారో తెలుసా?' అని విజయ్‌కాంత్ పేర్కొన్నారు.
తమిళనాడు మదురైలోని తెలుగు కుటుంబంలో విజయ్‌కాంత్ జన్మించగా, బెంగళూరులో ఓ మరాఠి కుటుంబంలో రజనీ జన్మించారు. రజనీపై విజయ్‌కాంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఆదివారం చెన్నైలో విజయ్‌కాంత్ దిష్టిబొమ్మను రజనీ ఫ్యాన్స్ తగలబెట్టి నిరసన తెలిపారు. ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో అన్న నిర్ణయాన్ని రజనీ అభిమానులకే వదిలేశాడు. ఫలానా పార్టీకి ఓటు వేయాలని ఆయన చెప్పలేదు. అయినప్పటికీ విజయ్‌కాంత్ ఆయనను రాజకీయ వివాదాల్లోకి లాగాలని చూస్తున్నారని రజనీ అభిమాన సంఘం చెన్నై అధ్యక్షుడు ఎన్ రాందాస్ పేర్కొన్నారు.