
50 రోజులు.. తీరని నోట్ల కష్టాలు
సాక్షి, నేషనల్ డెస్క్: నవంబర్ 8... రాత్రి 8 గంటలు... మరికాసేపట్లో జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారన్న బ్రేకింగ్ న్యూస్ చూసి.. న్యూస్ చానల్స్ చూస్తున్నవారు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రూ. వెయ్యి, రూ. 500 నోట్లను అర్ధరాత్రి నుంచి రద్దు చేస్తున్నట్లు చెప్పగానే అందరిలోను ఉలికిపాటు. నేటికి మోదీ నోట్ల రద్దు ప్రకటన చేసి 50 రోజులు... ఇప్పటికే దేశంలో ఏటీఎంలు, బ్యాంకుల ముందు అవే క్యూలు... అవే కష్టాలు..
నోట్ల రద్దుకు ముందు... ప్రస్తుతం!
ఎస్‌బీఐ అంచనా మేరకు నవంబర్ 9 నాటికి మొత్తం రద్దైన నోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు. డిసెంబర్ 30 నాటికి బ్యాంకులకు చేరే మొత్తం రూ. 13 లక్షల కోట్లుగా అంచనా. ప్రస్తుతం వేగంతో కరెన్సీ ముద్రణ కొనసాగిస్తే... మార్చి, ఏప్రిల్ 2017 వరకూ ప్రస్తుత పరిస్థితి తప్పదనేది నిపుణుల అభిప్రాయం. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నగదు విత్‌డ్రా చేసుకోవాలంటే మరో రెండు నెలలు అవసరమని ఎస్‌బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య తేల్చి చెప్పారు.
క్యూల కష్టాలు ఇంతింతకాదయా...
నవంబర్ 8న ప్రకటన అనంతరం కేంద్రం, ఆర్‌బీఐలు సవాలక్ష ఆంక్షలు, నిబంధనలతో తీవ్ర గందరగోళం సృష్టించాయి. పలుమార్లు ఈ నిబంధనలు మార్చారు. నవంబర్ 10న బ్యాంకులు, నవంబర్ 11న ఏటీఎంలు తెరుచుకున్నా... అప్పటి క్యూలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నోట్ల రద్దుతో బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలలో నిలబడి ఇంతవరకూ 100 మందికి పైగా మరణించినట్లు అంచనా.
మాట మార్చిన కేంద్రం
మొదట్లో నోట్ల రద్దును నల్లధనం, నకిలీ కరెన్సీ, ఉగ్రవాదులపై పోరుగా ప్రధాని అభివర్ణించగా... అనంతరం నగదు రహిత భారత్ కోసమంటూ స్వరం మారింది. దేశంలో దాదాపు 90 కోట్ల మందికి ఇంటర్నెట్‌తో అనుసంధానం లేదు. మరి ఒక్కసారిగా డిజిటల్ చెల్లింపులు ఏలా సాధ్యం అన్నదానికి సమాధానం లేదు.