ఆ స్కామ్‌లో రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి అరెస్ట్
ఆ స్కామ్‌లో రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి అరెస్ట్
Published Thu, Sep 21 2017 5:31 PM | Last Updated on Fri, Sep 22 2017 10:02 AM
సాక్షి,న్యూఢిల్లీ: ప్రైవేట్ వైద్య కళాశాలల అడ్మిషన్ ప్రక్రియను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను విస్మరించి వాటిలో ఎంబీబీఎస్ విద్యార్థుల ప్రవేశానికి సహకరించిన ఒడిషా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సహా ఆరుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదయ్యాయి. రిటైర్డ్ జడ్జి ఇష్రత్ మస్రూర్ ఖుద్దుసి సహా ఇతర నిందితులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన అనంతరం ఢిల్లీ, లక్నో,భువనేశ్వర్‌లలోని పలు ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. నిందితుల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీ అధినేతలు బీపీ యాదవ్, పలష్ యాదవ్‌లున్నారు. కాగా, ఢిల్లీలోని ఖుద్దుసి నివాసం పైనా దాడులు చేసిన సీబీఐ బృందాలు మొత్తంమీద రూ 1.91 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఖుద్దూసీ న్యాయపరమైన సలహాలు అందించడమే కాకుండా సుప్రీం కోర్టులో వారికి సానుకూల పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. మౌలిక వసతుల లేమి, అవసరమైన ప్రమాణాలను పాటించకపోడంతో రెండేళ్ల పాటు వైద్య కోర్సుల్లో ప్రవేశాలు జరపరాదని ప్రభుత్వం 46 కాలేజీలను ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రసాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీకి చెందిన బీపీ యాదవ్, పలాష్ యాదవ్‌లు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.
Advertisement