‘‘నేను రోజూ ప్రార్థనలు చేశాను. అదే విధంగా కష్టపడి చదివాను కూడా. ప్రతీ సబ్జెక్టుకు ప్రత్యేకంగా నోట్స్ తయారు చేసుకున్నాను. కీలక అంశాలను అందులో రాసుకున్నా. తద్వారా త్వరగా, మెరుగ్గా పాఠాలను అర్థం చేసుకొని గుర్తుపెట్టుకున్నా. చదివిన ప్రతీ అంశాన్ని అనేక మార్లు పునరుశ్చరణ చేసి.. వాటిని విశ్లేషించి అర్థం చేసుకున్నా’’అంటూ తన విజయ రహస్యాన్ని వెల్లడించింది సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100 శాతం(600/600) మార్కులు సాధించిన దివ్యాన్షి జైన్. హిస్టరీ సబ్జెక్టుపై పరిశోధన చేయాలనుకుంటున్నానని, దేశానికి సంబంధించిన గత చరిత్ర, విశేషాలపై అధ్యయనం చేయాలనుకుంటున్నట్లు భవిష్యత్ ప్రణాళిక గురించి పంచుకుంది. కాగా సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు సోమవారం వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో బాలురపై(86.19 శాతం) బాలికలు(92.15 శాతం) పైచేయి సాధించారు.(సీబీఎస్‌ఈ ‘12’లో బాలికలదే పైచేయి)
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన దివ్యాన్షి జైన్ 600/600 స్కోరు సాధించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. నవయుగ్ రేడియన్స్ సీనియర్ సెకండరీ స్కూళ్లో విద్యనభ్యసించిన ఆమె ఇంగ్లీష్, సంస్కృతం, చరిత్ర, ఆర్థికశాస్త్రం, భూగోళ శాస్త్రం, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్‌లో వంద శాతం మార్కులు సాధించింది. దివ్యాన్షి తండ్రి స్థానికంగా దుకాణం నిర్వహిస్తుండగా.. ఆమె తల్లి గృహిణిగా ఇంటి బాధ్యతలు నెరవేస్తున్నారు. ఇక పరీక్షల్లో తాను సాధించిన గెలుపు గురించి దివ్యాన్షి మాట్లాడుతూ.. గంటల కొద్దీ పుస్తకాలతో కుస్తీ పట్టలేదని, ప్రణాళిక ప్రకారం రివిజన్, మాక్ టెస్టులకు సమయం కేటాయించి.. ఎక్కువగా ఎన్‌సీఈఆర్‌టీ(నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్) పుస్తకాలనే చదివానని చెప్పుకొచ్చింది. తన విజయానికి తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహమే కారణమని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment