
న్యూఢిల్లీ: వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌కు విద్యార్హతలు నిర్ణయించడంలో తమ పాత్ర లేదని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ)ని సంప్రదించాలని సూచించింది. దూర విద్యలో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన వారు, 12 వ తరగతిలో జీవశాస్త్రాన్ని అదనపు సబ్జెక్టుగా అభ్యసించిన వారిని నీట్‌కు అనర్హులుగా ప్రకటించడంతో ఫిర్యాదులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ స్పందిస్తూ..‘ ఎంసీఐ సమర్పించిన విద్యార్హతల మేరకు నీట్ పరీక్ష నిర్వహణ వరకే మా బాధ్యత. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించాం. ఇకపై ఎలాంటి ఫిర్యాదులనైనా మాకు పంపే ముందు నీట్ వెబ్‌సైట్‌లో ఉంచిన సమాచారాన్ని జాగ్రత్తగా చదువుకోగలరు’ అని అభ్యర్థులకు సూచించింది. మరోవైపు, మే 6న జరిగే నీట్ పరీక్షకు మరో 43 పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఇందులో తెలంగాణ నుంచి 2 పట్టణాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 పట్టణాలున్నాయి. దీంతో ఈసారి మొత్తం 150 పట్టణాల్లో పరీక్ష జరుగుతుంది.