ఉరి వేసుకోకుండా.. ఫ్యాన్లకు సెన్సార్లు
ఉరి వేసుకోకుండా.. ఫ్యాన్లకు సెన్సార్లు
Published Thu, Mar 30 2017 4:58 PM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
కోటా: విద్యార్థులు ఫ్యాన్లకు ఉరి వేసుకోకుండా చేసేందుకు రాజస్తాన్ లోని కోటా నగర హాస్టల్ యాజమాన్యాల సంఘం విరుగుడు కనిపెట్టింది. ఫ్యాన్లలో సెన్సార్లు, స్ప్రింగులు అమర్చి ఆత్మహత్యలను నివారించాలని యోచిస్తోంది. ఈ ఫ్యాన్లకు 20 కిలోల మించి బరువును గనుక వేలాడదీస్తే అవి అలారం మోతతో హాస్టల్ యాజమాన్యాలను అప్రమత్తం చేస్తాయి. కోటా నగరంలో కోచింగ్ సెంటర్లకు దేశ వ్యాప్తంగా పేరుంది. ఇక్కడున్న 500 పైగా కోచింగ్ సెంటర్లలో ఏటా దేశవ్యాప్తంగా సుమారు 1.75 లక్షల మంది విద్యార్థులు ప్రిపేరయ్యేందుకు వస్తుంటారు. ఇందుకోసం వారు హాస్టళ‍్లలో బస చేస్తారు.
అయితే, పరీక్షల పోటీ, ఇతర కారణాల నేపథ్యంలో హాస్టళ్లలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. అందులోనూ ఫ్యాన్లకు ఉరి వేసుకుంటున్న ఘటనలు బాగా జరుగుతున్నాయి. ఈ కారణంగా ఆయా హాస్టళ్ల యాజమాన్యాలకు పోలీసుల విచారణలు, న్యాయపరమైన చిక్కులతో పాటు తమ పేరు దెబ్బతింటుందన్న ఆందోళన పెరిగిపోయింది. వీటన్నిటినీ చెక్ పెట్టడానికి వారు రకరకాల మార్గాలను అన్వేషించారు. అయితే ఫ్యాన్లు ఎక్కువ బరువు మోయకుండా ఉండటానికి స్ప్రింగులు అమర్చాలని, ఏదైనా వేలాడదీసినప్పుడు అప్రమత్తం చేసేందుకు ఫ్యాన్లలో రహస్య సెన్సార్లను ఉంచటం మేలైన విధానంగా తీర్మానించారు.
ఈ మేరకు కోటా హాస్టల్ యాజమాన్యాల సంఘం గుజరాత్‌కు చెందిన ఓ సంస్థకు స్ప్రింగులు, సెన్సార్లు అమర్చే పనిని అప్పగించింది. వచ్చే మూడు నెలల్లో నగరంలోని అన్ని హాస్టళ్లలో ఇవి పని చేయటం ప్రారంభిస్తాయి. ఇంతేకాకుండా, ఆయా హాస్టళ్లలో విద్యార్థుల హాజరయ్యేది.. లేనిది చెప్పేందుకు బయోమెట్రిక్ విధానం ద్వారా సెల్‌ఫోన్ మెసేజ్‌లను కూడా వారి తల్లిదండ్రులకు, హాస్టల్ వార్డెన్‌కు, కోచింగ్ సెంటర్ల వారికి పంపేందుకు యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నాయి. కోటాలోని 500 పై చిలుకు హాస్టళ్లలో ఇప్పటికే 90 హాస్టళ్లలో ఈ విధానం అమల్లో ఉంది. నేషనల్ క్రైం బ్యూరో రికార్డు- 2014 ప‍్రకారం ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నవారిలో ఆ ఏడాది 45 మంది విద్యార్థులు ఒత్తిడితో బలవన్మరణం చెందగా, గత ఏడాది 17 మంది మృతిచెందారు.
Advertisement
Advertisement