ceiling fans
-
సీలింగ్ ఫ్యాన్లకు కొత్త నిబంధనలు.. అతిక్రమిస్తే భారీ జరిమానాలు
Quality Norms For Ceiling Fans: నాసిరకం వస్తువుల దిగుమతిని అరికట్టేందుకు, దేశీయంగా విద్యుత్ ఫ్యాన్ల తయారీని పెంచేందుకు ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లకు ప్రభుత్వం తప్పనిసరి నాణ్యతా నిబంధనలను జారీ చేసింది. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఆగస్టు 9న నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలక్ట్రిక్ సీలింగ్ టైప్ ఫ్యాన్స్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్- 2023 కిందకు వచ్చే వస్తువులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గుర్తును కలిగి ఉంటే తప్ప వాటిని ఉత్పత్తి చేయడం, విక్రయించడం, వ్యాపారం చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం కుదరదు. ఈ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత నుంచి ఇది అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లకు ఇప్పటి వరకు ఎలాంటి బిస్ ధ్రువీకరణ నియమాలు లేవు. బిస్ చట్టం నిబంధనను ఉల్లంఘిస్తే, మొదటి నేరానికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా కనీసం రూ. 2 లక్షల జరిమానా విధించవచ్చు. మరోసారి ఉల్లంఘనలకు పాల్పడితే కనీస జరిమానా రూ. 5 లక్షలకు పెరుగుతుంది. ఇది ఆయా వస్తువుల విలువ కంటే 10 రెట్లు వరకు ఉండవచ్చు. ఎంఎస్ఎంఈలకు సడలింపులు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (QCO) అమలుకు సంబంధించి ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లను తయారు చేసే దేశీయ సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు డీపీఐఐటీ సడలింపులు ఇచ్చింది. ఎంఎస్ఎంఈలకు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి 12 నెలల తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. -
సర్కారు స్కూళ్లకు 2,93,388 సీలింగ్ ఫ్యాన్లు
సాక్షి, అమరావతి: విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పడుతోంది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలూ ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన గురించి పట్టించుకోలేదు. తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా సర్కారు బడులను బాగు చేయడమే కాకుండా విద్యార్థులు, ఉపాధ్యాయులు కూర్చునేందుకు అవసరమైన ఫర్నిచర్‌ను పెద్దఎత్తున సమకూర్చుతున్నారు. ఒక పక్క స్కూలు భవనాల మరమ్మతులు నిర్వహిస్తూనే మరోపక్క బల్లలు, కుర్చీలు, టేబుళ్లతో పాటు సీలింగ్ ఫ్యాన్లు సమకూర్చుతున్నారు. అల్మారాలు, స్మార్ట్ టీవీలు, రక్షిత మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు లాంటి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో దశాబ్దాల తరువాత రాష్ట్రంలో సర్కారు బడుల రూపురేఖలు మారుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా.. 2019 నవంబర్ 14వ తేదీన తొలిదశలో 15,715 స్కూళ్లలో మన బడి నాడు–నేడు పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు నాడు–నేడు తొలి దశ పనులకు రూ.2,580 కోట్లను వ్యయం చేశారు. పనులన్నీ శరవేగంగా సాగుతుండగా ఇప్పటికే çపనులు పూర్తయిన బడులు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా కనిపిస్తున్నాయి. తొలి దశ నాడు నేడు పనులకు రూ.3,437 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే ఎక్కడా రాజీలేకుండా పనులు చేస్తుండటంతో అంచనాలు పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెలాఖరుకు తొలిదశ పనులు పూర్తి ప్రభుత్వ పాఠశాలల దుస్థితి, విద్యార్థుల వెతలను పాదయాత్రలో స్వయంగా చూసిన ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే మన బడి నాడు–నేడు ద్వారా చేపట్టాల్సిన పనులను నిర్దేశించారు. రూ.826.70 కోట్ల అంచనా వ్యయంతో రన్నింగ్ వాటర్‌తో కూడిన మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. తొలిదశలో 14,293 మరుగుదొడ్ల పనులు మంజూరయ్యాయి. తొలి దశ నాడు–నేడులో రూ.325.19 కోట్ల వ్యయంతో 14,474 రక్షిత మంచినీటి పనులను చేపట్టారు. ఈ నెలాఖరుకు తొలి దశ నాడు–నేడు పనులు పూర్తి చేయాలని ఇటీవల స్పందన కార్యక్రమం సమీక్షలో కలెక్టర్లు, జేసీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. -
పెట్రోల్ బంకుల్లో ఎల్ఈడీలు, సీలింగ్ ఫ్యాన్లు
న్యూఢిల్లీ: దేశంలోని పెట్రోల్ బంకుల్లో త్వరలో విద్యుత్‌ను అదా చేసే ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు, సీలింగ్ ఫ్యాన్లను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో ఎల్ఈడీ బల్బును రూ.65కు, ట్యూబ్‌లైట్‌ను రూ.230, సీలింగ్ ఫ్యాన్‌ను రూ.1,150కు ప్రజలకు అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఆ తర్వాత నెలరోజుల్లో అమ్మకాలు మొదలైతాయి. ఓఎంసీకి దేశవ్యాప్తంగా 53 వేల పెట్రోల్ బంకులు ఉన్నాయి. అయితే వీటన్నిటిలోనూ ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లు, సీలింగ్ ఫ్యాన్లను విక్రయిస్తారా, లేదా అనేది స్పష్టం కాలేదు. -
ఉరి వేసుకోకుండా.. ఫ్యాన్లకు సెన్సార్లు
కోటా: విద్యార్థులు ఫ్యాన్లకు ఉరి వేసుకోకుండా చేసేందుకు రాజస్తాన్ లోని కోటా నగర హాస్టల్ యాజమాన్యాల సంఘం విరుగుడు కనిపెట్టింది. ఫ్యాన్లలో సెన్సార్లు, స్ప్రింగులు అమర్చి ఆత్మహత్యలను నివారించాలని యోచిస్తోంది. ఈ ఫ్యాన్లకు 20 కిలోల మించి బరువును గనుక వేలాడదీస్తే అవి అలారం మోతతో హాస్టల్ యాజమాన్యాలను అప్రమత్తం చేస్తాయి. కోటా నగరంలో కోచింగ్ సెంటర్లకు దేశ వ్యాప్తంగా పేరుంది. ఇక్కడున్న 500 పైగా కోచింగ్ సెంటర్లలో ఏటా దేశవ్యాప్తంగా సుమారు 1.75 లక్షల మంది విద్యార్థులు ప్రిపేరయ్యేందుకు వస్తుంటారు. ఇందుకోసం వారు హాస్టళ్లలో బస చేస్తారు. అయితే, పరీక్షల పోటీ, ఇతర కారణాల నేపథ్యంలో హాస్టళ్లలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. అందులోనూ ఫ్యాన్లకు ఉరి వేసుకుంటున్న ఘటనలు బాగా జరుగుతున్నాయి. ఈ కారణంగా ఆయా హాస్టళ్ల యాజమాన్యాలకు పోలీసుల విచారణలు, న్యాయపరమైన చిక్కులతో పాటు తమ పేరు దెబ్బతింటుందన్న ఆందోళన పెరిగిపోయింది. వీటన్నిటినీ చెక్ పెట్టడానికి వారు రకరకాల మార్గాలను అన్వేషించారు. అయితే ఫ్యాన్లు ఎక్కువ బరువు మోయకుండా ఉండటానికి స్ప్రింగులు అమర్చాలని, ఏదైనా వేలాడదీసినప్పుడు అప్రమత్తం చేసేందుకు ఫ్యాన్లలో రహస్య సెన్సార్లను ఉంచటం మేలైన విధానంగా తీర్మానించారు. ఈ మేరకు కోటా హాస్టల్ యాజమాన్యాల సంఘం గుజరాత్‌కు చెందిన ఓ సంస్థకు స్ప్రింగులు, సెన్సార్లు అమర్చే పనిని అప్పగించింది. వచ్చే మూడు నెలల్లో నగరంలోని అన్ని హాస్టళ్లలో ఇవి పని చేయటం ప్రారంభిస్తాయి. ఇంతేకాకుండా, ఆయా హాస్టళ్లలో విద్యార్థుల హాజరయ్యేది.. లేనిది చెప్పేందుకు బయోమెట్రిక్ విధానం ద్వారా సెల్‌ఫోన్ మెసేజ్‌లను కూడా వారి తల్లిదండ్రులకు, హాస్టల్ వార్డెన్‌కు, కోచింగ్ సెంటర్ల వారికి పంపేందుకు యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నాయి. కోటాలోని 500 పై చిలుకు హాస్టళ్లలో ఇప్పటికే 90 హాస్టళ్లలో ఈ విధానం అమల్లో ఉంది. నేషనల్ క్రైం బ్యూరో రికార్డు- 2014 ప్రకారం ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నవారిలో ఆ ఏడాది 45 మంది విద్యార్థులు ఒత్తిడితో బలవన్మరణం చెందగా, గత ఏడాది 17 మంది మృతిచెందారు. -
ఐటమ్ గాళ్ సంచలన విషయాలు
ముంబై: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ ఐటమ్ గాళ్ రాఖీ సావంత్ సంచలన విషయాలు వెల్లడించింది. ప్రత్యూషను రాహుల్ రాజ్ సింగ్ నిత్యం చిత్రహింసలు పెట్టేవాడని విలేకరుల సమావేశంలో చెప్పింది. ప్రత్యూషను టార్చర్ పెట్టొద్దని రాహుల్ కు చాలాసార్లు చెప్పానని తెలిపింది. ప్రత్యూష కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రత్యూషను హత్య చేశారని ఆమె ఆరోపించింది. మహిళల ఆత్మహత్యల నివారణకు తనదైన శైలిలో సూచన చేసింది రాఖీ సావంత్. ఇళ్లలో సీలింగ్ ఫ్యాన్లు నిషేధించాలని సూచించింది. సీలింగ్ ఫ్యాన్లపై నిషేధం విధించాలని మీడియా ముఖంగా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసింది. 'కూతుళ్లు, సోదరీమణులు, కోడళ్లు సీలింగ్ ఫ్యాన్లకు ఉరేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటిని నిషేధించాలని ప్రధాని మోదీని కోరుతున్నా. మీ కుమార్తెలు లేదా సోదరీమణులపై ప్రేమ ఉంటే ఇళ్లలోని సీలింగ్ ఫ్యాన్లను పీకి బయటపడేయండి. టేబుల్ ఫ్యాన్లు లేదా ఏసీలు వాడండి' అని రాఖీ సావంత్ సూచించింది. కాగా, ప్రత్యూష ఆత్మహత్య కేసులో రాహుల్ పై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘ఫ్యాను’ గుర్తుపై ఆర్ఓలకు సమాచారమివ్వండి
సీఈఓకు వైఎస్సార్సీపీ వినతి సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ, శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ తరఫున ఎన్నికల పోటీ చేసే అభ్యర్థులకు ‘సీలింగ్ ఫ్యాను’ ను ఉమ్మడి చిహ్నంగా కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన విషయాన్ని రాష్ట్రంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలివ్వాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. వైఎస్సార్సీపీ నేతలు పీఎన్వీ ప్రసాద్, కె.శివకుమార్ గురువారం ఒక వినతిపత్రం సమర్పించారు. తమపార్టీకి ‘సీలింగ్ ఫ్యాను’ గుర్తు కేటాయించాలని ఎలాంటి వర్తమానం రాలేదని పలువురు రిటర్నింగ్ అధికారులు తమకు తెలియజేశారని వారు సీఈఓ దృష్టికి తెచ్చారు. అందువల్ల తక్షణమే ఈ మేరకు అధికారులందరికీ ఆదేశాలివ్వాలని వారు కోరారు. కేంద్ర ఎన్నికల కమిషన్ గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్‌కు ‘సీలింగ్ ఫ్యాను’ చిహ్నాన్ని కేటాయిస్తూ రాసిన లేఖ ప్రతిని కూడా వారు వినతిపత్రంతో జతపరిచారు. భన్వర్‌లాల్ సమయానికి కార్యాలయంలో లేనందువల్ల వైఎస్సార్ సీపీ నేతలు ఇచ్చిన వినతిపత్రాన్ని అదనపు సీఈఓ వెంకటేశ్వరరావు తీసుకుని ఆ ప్రకారం సంబంధిత అధికారులకు ఆదేశాలు పంపారు. ‘సీలింగ్ ఫ్యాను’ కేటాయింపునకు సంబంధించిన ఆదేశాలు వెబ్సైట్లో ఉన్నాయని ఆయన అధికారులకు చెప్పినట్టు పీఎన్వీ ప్రసాద్ తెలిపారు.