Quality Norms For Ceiling Fans: నాసిరకం వస్తువుల దిగుమతిని అరికట్టేందుకు, దేశీయంగా విద్యుత్ ఫ్యాన్ల తయారీని పెంచేందుకు ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్‌లకు ప్రభుత్వం తప్పనిసరి నాణ్యతా నిబంధనలను జారీ చేసింది. దీనికి సంబంధించి డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఆగస్టు 9న నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎలక్ట్రిక్ సీలింగ్ టైప్ ఫ్యాన్స్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్- 2023 కిందకు వచ్చే వస్తువులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గుర్తును కలిగి ఉంటే తప్ప వాటిని ఉత్పత్తి చేయడం, విక్రయించడం, వ్యాపారం చేయడం, దిగుమతి చేయడం, నిల్వ చేయడం కుదరదు.
ఈ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి ఆరు నెలల తర్వాత నుంచి ఇది అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్‌లకు ఇప్పటి వరకు ఎలాంటి బిస్ ధ్రువీకరణ నియమాలు లేవు. బిస్ చట్టం నిబంధనను ఉల్లంఘిస్తే, మొదటి నేరానికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష లేదా కనీసం రూ. 2 లక్షల జరిమానా విధించవచ్చు. మరోసారి ఉల్లంఘనలకు పాల్పడితే కనీస జరిమానా రూ. 5 లక్షలకు పెరుగుతుంది. ఇది ఆయా వస్తువుల విలువ కంటే 10 రెట్లు వరకు ఉండవచ్చు.
ఎంఎస్‌ఎంఈలకు సడలింపులు
క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (QCO) అమలుకు సంబంధించి ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లను తయారు చేసే దేశీయ సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు డీపీఐఐటీ సడలింపులు ఇచ్చింది. ఎంఎస్‌ఎంఈలకు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి 12 నెలల తర్వాత ఇది అమల్లోకి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment