ఢిల్లీ: దివ్యాంగుల కోసం 144 ప్రముఖ పర్యాటక స్థలాలలో ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీల్ చైర్లు, బ్యాటరీతో నడిచే బండ్లు, ప్రత్యేక టాయిలెట్లతోపాటు ప్రత్యేక మార్గాలను వారి కోసం ఏర్పాటు చేయనున్నారు. తొలివిడతలో 50 పర్యాటక స్థలాలలో ఆ సౌకర్యాలను కల్పించనున్నారు. గత డిసెంబరులో ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన 'సుగమ్య భారత్ అభియాన్' పథకంలో భాగంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంకల్పించింది.
వివిధ రకాలైన వైకల్యంతో వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న సుమారు 50 నుంచి 80 లక్షల మంది సౌకర్యాల లేమి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నది విశ్లేషకుల మాట. కేవలం వారికి తగిన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే పర్యాటక స్థలాలకు వెళ్లే హక్కును కోల్పోతున్నారు. అందరితోపాటు దివ్యాంగులకు కూడా సమాన సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతోనే 'సుగమ్య భారత్ అభియాన్' పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా 2018 జూలై వరకు జాతీయ, రాష్ట్ర ముఖ్య నగరాల్లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో కనీసం 50 శాతం భవనాల్లోనైనా దివ్యాంగులకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు సాంస్కృతిక శాఖ వెల్లడించింది.
కట్టడాల నిర్మాణాన్ని మార్చకుండానే.. వారికి తగిన సౌకర్యాలను కల్పించే దిశగా అడుగులు పడనున్నాయి. తొలివిడతలో తాజ్ మహల్, జగన్నాథ ఆలయం, ఖజురహో, కుతుబ్ మినార్, ఎర్రకోట, హంపి, కోణార్క్ సూర్య దేవాలయం తదితర కట్టడాలను ఎంపిక చేశారు. అలాగే త్వరలోనే ప్రతి పర్యాటక స్థలంలోను సౌర విద్యుత్ వినియోగించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.
వారి కోసం త్వరలో ప్రత్యేక సౌకర్యాలు..
Published Fri, Jul 1 2016 4:50 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement