బడికైనా, గుడికైనా.. ఇలాగే వెళ్తారు!
ఇటు జమ్ము-పూంచ్ హైవే.. అటు చాక్లీ, ఖర్దిను, అప్పర్ పోథా గ్రామాలు. మధ్యలో రాజౌరి ప్రధాన నది. ఈ మూడు గ్రామాల వాసులు బయట ప్రపంచానికి అనుసంధానం కావాలంటే ఈ రాజౌరీ నదిని దాటాలి. కానీ ఈ నదిపై అధికారులు ఎలాంటి వంతెన నిర్మించలేదు. ఫలితంగా ప్రజలు ప్రాణాలు పణంగా పెట్టి.. సొంతంగా తయారుచేసుకున్న పడవల్లో ఇలా నదిని దాటుతున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా, ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లాలన్నా.. ఆపత్కాలంలో ఆస్పత్రులకు వెళ్లాలన్నా.. ఇలాంటి ప్రమాదకరమైన పడవలే వారికి దిక్కు. అయినా అధికారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఇక్కడ వంతెన నిర్మించడానికి తలపెట్టింది. కానీ నత్తనడకన సాగుతోంది. అది ఎప్పుడూ పూర్తవుతుందో దేవుడికి కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక ఇలా సొంతంగా నిర్మించుకున్న పడవల్లో నదిని దాటి బయటి ప్రపంచానికి అనుసంధానం అవుతున్నామని చాక్లీ గ్రామ ప్రజలు చెప్తున్నారు.