రేప్ బాధితురాలిపై కోర్టు షాకింగ్ కామెంట్లు
రేప్ బాధితురాలిపై కోర్టు షాకింగ్ కామెంట్లు
Published Fri, Sep 22 2017 8:55 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM
సాక్షి, ఛండీగఢ్: హర్యానాలో సంచలనం సృష్టించిన లా విద్యార్థిని అత్యాచార ఉదంతం గుర్తుండే ఉంటుంది. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ ఛాటింగ్‌ను సాక్ష్యంగా పరిగణిస్తూ కోర్టు నిందితులకు శిక్షలు ఖరారు చేసింది. అయితే ఆ శిక్షలను కొట్టేస్తూ ఛండీగఢ్ హైకోర్టు ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బెంచ్ బాధితురాలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం విశేషం.
బాధితురాలి మానసిక పరివర్తనే జరిగిన అఘాయిత్యానికి కారణమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘కాస్త కూడా పరిణితి లేకుండా అమ్మాయి వ్యవహరించింది. యువకులతో మరీ సానిహిత్యంగా మెలిగింది. పైగా లైంగిక పరమైన కోరికలతోనే స్నేహితులతో అసభ్యమైన ఛాటింగ్ చేసింది. దర్యాప్తులో అమ్మాయి అన్ని విషయాలను ఒప్పుకుంది. వైద్యులు కూడా యువతి మానసిక ప్రవర్తన సరిగ్గా లేదన్న విషయాన్ని తేల్చారు. అలాంటప్పుడు బలవంతంగా లైంగిక దాడి చేశారన్న ఆరోపణలు సరికాదు. అదే సమయంలో నిందితులకు కూడా అంత కఠిన శిక్ష విధించాల్సిన అవసరం లేదు’ బెంచ్ అభిప్రాయపడింది. విద్యార్థుల భవిష్యత్తును కూడా పరిగణనలోకి తీసుకునే తాము ఈ తీర్పు వెలువరిస్తున్నామని జడ్జిలు మహేష్ గ్రోవర్, రాజ శేఖర్ అట్టిరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
సోనేపట్ లో ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో హార్దిక్ సిక్రీ, కరణ్ ఛాబ్రా, వికాస్ గార్గ్ అనే విద్యార్థులు తమ జూనియర్ అమ్మాయిపై రెండేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె నగ్న చిత్రాలను సేకరించి, అందరితో పంచుకోవడంతో పాటు, యాపిల్ ఐ క్లౌడ్ లో దాచారు. సెక్స్ టాయ్స్ కొనిచ్చి వాటిని వాడుతూ, స్కైప్ లో లైవ్ వీడియో చూపించాలని బెదిరించేవారు. వీరి మధ్య సాగిన అన్ని అంశాలూ వాట్స్ యాప్ లో భద్రంగా ఉండిపోయాయి. చివరకు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 2015 ఏప్రిల్ నుంచి సాగిన కేసులో ఈ యేడాది జూన్‌లో తీర్పు వెలువడింది. నిందితులు, బాధితురాలికి మధ్య జరిగిన వాట్స్ యాప్ సంభాషణనే కోర్టు సాక్ష్యంగా పరిగణిస్తూ, ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష, మరో విద్యార్థికి ఏడేళ్ల జైలు శిక్షను న్యాయమూర్తి విధించారు.
Advertisement
Advertisement