
సాక్షి, హైదరాబాద్: తమపై అత్యాచారం చేసిన గ్రేహౌండ్స్ పోలీసులపై నమోదైన కేసులో విచారణ నిమిత్తం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియామకం కోసం విశాఖ జిల్లా, వాకపల్లికి చెందిన గిరిజన మహిళల న్యాయ పోరాటం ఫలించింది. వారి అభ్యర్థనపట్ల ఉమ్మడి హైకోర్టు సానుకూలంగా స్పందించింది. గ్రేహౌండ్స్ పోలీసులపై నమోదైన కేసులో విచారణ జరుపుతున్న విశాఖ 11వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు, ఎస్‌సీ ఎస్‌టీ కేసుల ప్రత్యేక కోర్టులో స్పెషల్ పీపీగా పల్లా త్రినాథరావును నియమించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
వారంలోగా ఈ నియామకాన్ని పూర్తిచే యాలని సూచించింది. త్రినాథరావుపై గత నెల 29న కేసు నమోదైందని, అది పెండింగ్‌లో ఉన్నందున అతన్ని నియమించరాదని డీఆర్‌వో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సీతారామమూర్తి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.