ఒడిశాలో చాతక పక్షి ప్రత్యక్షం!
బెర్హంపూర్ (ఒడిశా): వర్షాలకు భవిష్య సూచకంగా భావించే చాతక పక్షి ఒడిశాలో ప్రత్యక్షం కావడంతో స్థానికుల్లో వర్షాల రాకపై ఆశలు మరింత పెరిగాయి. ఒడిశాకు చాతక పక్షి వలస వచ్చిన నేపథ్యంలో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు సమీపించినట్లేనని పక్షి శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. రుతుపవనాల పక్షి, వానకోయిలగా కూడా పిలిచే ఈ పక్షి దక్షిణాఫ్రికా నుంచి ఏటా నైరుతి రుతుపవనాలకు ఐదు నుంచి ఏడు రోజుల ముందుగానే ఒడిశాకు వలస వస్తుందని ప్రముఖ శాస్త్రవేత్త యూఎన్ దేవ్ గురువారం వెల్లడించారు. భువనేశ్వర్‌లోని బెర్హంపూర్ ఏరియాలో తాము చాతక పక్షిని చూశామని ఆయన తెలిపారు. సాధారణంగా రాష్ట్రంలోకి రాజా ఉత్సవం సమయంలో ఈ పక్షి వస్తుందని, ఈసారి కాస్త ముందుగానే వచ్చిందన్నారు.
చాతక పక్షికి, వానలకు సంబంధం ఉన్నట్లు మహాభారతంలో, కాళిదాసు మేఘసందేశంలో కూడా ఉందని, అలాగే ప్రముఖ పక్షి శాస్త్రవేత్త సలీం అలీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిం చారని దేవ్ తెలిపారు. కాగా, ఒడి శాలోకి రుతుపవనాలు జూన్ 15న లేదా 16న ప్రవేశించవచ్చని భువనేశ్వర్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ ఎస్‌డీ సాహూ పేర్కొన్నారు.