
సాక్షి, బరంపురం: గంజా జిల్లాలో అక్రమంగా నడుస్తున్న నాటు సారా దుకాణాలపై దాడికి వెళ్లిన ఎక్సైజ్ స్క్వాడ్‌పై గ్రామస్తులు ఎదురు దాడి చేసి వారిని చితకబాదారు. అంతటితో ఆగకుండా వారిని విద్యుత్ స‍్తంభాలకు కట్టేసి వారి యూనిఫారాలు విప్పి నిప్పుపెట్టి కాల్చివేశారు. ఈ సంఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం రేపింది. గాయాలపాలైన ఎక్సైజ్ అధికారులకు తొలుత పత్రపూర్ సమితి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం ఎంకేసీజీ మెడికల్ కళాశాల ఆస‍్పత్రికి తరలించారు. పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
జిల్లాలోని పత్రపూర్ సమితి, జరడ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల మోసనిబడా గ్రామంలో కొద్ది రోజులుగా అక్రమ సారా దుకాణాలు నిర‍్వహిస్తున్నారన‍్న సమాచారం మేరకు ఎక్సైజ్ స్క్వాడ్ ఆదివారం తనిఖీ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఎక్సైజ్ స్క్వాడ్ అధికారులపై గ్రామస్తులు ముకుమ్మడిగా దాడికి దిగారు. అధికారుల యూనిఫాం విప్పేసి వారిని విద్యుత్ స్తంభాలకు కట్టి చితకబాదారు. ఆగ్రహించిన జనం విద్యుత్ అధికారుల యూనిఫాంలకు నిప్పుపెట్టి తగులబెట్టారు.
గ్రామంలో పోలీస్ బలగాలు
ఈ విషాద సంఘటనలో నలుగురు అధికారులతో పాటు 10 మంది సిబ్బంది గాయపడ్డారు. మరో వైపు జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి పలువురు గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నట్లు జరడ పోలీస్‌స్టేషన్ ఐఐసీ అధికారి చెప్పారు. ప్రస్తుతం మోసనిబడా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో అదనపు పోలీసు బలగాలు మోహరించి శాంతి భద్రతలు పరివేక్షిస్తున్నారు.



Comments
Please login to add a commentAdd a comment