‘మెట్రో’లో ఉద్యోగం అంటూ మోసం | cheating with metro job | Sakshi
Sakshi News home page

‘మెట్రో’లో ఉద్యోగం అంటూ మోసం

Published Fri, Sep 19 2014 10:27 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

cheating with metro job

సాక్షి, ముంబై: మెట్రో సంస్థలో ఉద్యోగుల భర్తీ ప్రక్రియ నకిలీ ప్రకటన, వెబ్‌సైట్‌పై బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ముంబై ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) పరిపాలన విభాగం అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ కుండలిక్ నిగడే చెప్పారు. ఈ బోగస్ వెబ్‌సైట్, ప్రకటనవల్ల అనేక మంది అమాయక నిరుద్యోగులు మోసపోయారు. లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నారు. దీంతో పోలీసులు ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్నారు.
 
కుండలిక్ నిగడే అందించిన వివరాల ప్రకారం... త్వరలో పనులు ప్రారంభమయ్యే మెట్రో-3 రైలు ప్రాజెక్టు కోసం ఆఫీసర్స్, క్లర్క్‌లు, ఇతర సాంకేతిక సిబ్బంది భర్తీ ప్రక్రియ ముంబై మెట్రో రైలు కార్పొరేషన్ ప్రారంభించింది. దీన్ని అవకాశంగా తీసుకుని ఓ ముఠా ఓ మరాఠీ దినపత్రిక నాగపూర్ ఎడిషన్‌లో నకిలీ ప్రకటన ఇచ్చింది. అందులో అభ్యర్థులు సంప్రదించేందుకు ఓ ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది. ఇంతటితో ఊరుకోకుండా నకిలీ వెబ్‌సైట్ కూడా తెరిచారు. అందులో అమాయకులను ఆకట్టుకునేందుకు ఈ ఏడాది మేలో ముఖ్యమంత్రి వర్సోవాలో మెట్రో రైలు ప్రారంభించినప్పటి ఫొటోలు పెట్టారు. అమాయకులు నమ్మడానికి ఎంపికైన కొందరు అభ్యర్థుల పేర్లను అందులో పొందుపరిచారు. దీంతో నిరుద్యోగుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అనేక మంది నిరుద్యోగులు ఆ ప్రకటనను నమ్మి ముఠా సభ్యులు సూచించిన ప్రకారం బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేశారు. ఉద్యోగం వస్తుందని గంపెడాశతో ఉన్నారు. కాని ఎవరూ దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వలేదు.  
 
ఈ బండారం బయటపడిందిలా...
ఎమ్మెమ్మార్డీయేలో పనిచేస్తున్న ఓ సిబ్బంది కూతురు ఈ ప్రకటన, వెబ్‌సైట్ చూసి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. తరువాత  బ్యాంక్‌లో రూ.13,500 డిపాజిట్ చేయాలని ముఠా సభ్యులు ఫోన్‌చేసి చెప్పారు. కాని ఉద్యోగ భర్తీ ప్రక్రియలో ఇలా డబ్బులు డిపాజిట్ చేయరని తెలియడంతో ఈ ముఠా బండారం బయట పడింది. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఆ ల్యాండ్ లైన్ నంబర్ ఢిల్లీకి చెందినదని తెలిపారు. దీనిపై అజ్ఞాత వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నకిలీ వెబ్‌సైట్‌ను మూసివేసేందుకు సైబర్ శాఖ అధికారుల సాయం తీసుకుంటున్నట్లు నిగడే తెలిపారు. ఇలాంటి నకిలీ ప్రకటనలకు బలికావద్దని ఎమ్మెమ్మార్డీయే అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement