విద్యుత్ శాఖ మంత్రి పై అవినీతి విచారణ
చెన్నై: తమిళనాడు ప్రభుత్వ విద్యుత్ శాఖ మంత్రి నత్తం విశ్వనాథన్ రూ.525 కోట్లు లంచం పుచ్చుకున్నట్లుగా వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా అవినీతి నిరోధక శాఖను మద్రాసు హైకోర్టు మంగళవారం ఆదేశించింది. సౌరశక్తి విద్యుత్ కొనుగోలులో అదానీ గ్రూపు సంస్థలతో మంత్రి నత్తం విశ్వనాథన్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపిస్తూ చెన్నై కొట్టూరుపురానికి చెందిన శ్రీనివాస్ మద్రాసు హైకోర్టులో ఇటీవల ఒక పిటిషన్ దాఖలు చేశారు.
తమిళనాడు విద్యుత్ బోర్డు వారు సౌర విద్యుత్ కొనుగోలుకు యూనిట్ రూ.6.48లు చెల్లించేలా ఒప్పందం చేసుకోగా, వాస్తవానికి ప్రభుత్వం రూ.7.01 చెల్లిస్తోందని తెలిపారు. సౌరశక్తి విద్యుత్‌కు ఇతర రాష్ట్రాలు యూనిట్‌కు రూ.5.01 చెల్లిస్తుండగా, తమిళనాడు రెండు రూపాయలు అదనంగా చెల్లిస్తోందని చెప్పారు .
రామనాథపురం జిల్లాలో అదానీగ్రూపు సంస్థల వారు అధిక సంఖ్యలో సౌరశక్తి ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకే రూ.2 ఎక్కువగా చెల్లిస్తున్నారని ఆరోపించారు. అదానీ గ్రూపు సంస్థలతో పాటు ఇతర సౌరశక్తి ఉత్పత్తిదారుల నుంచి మంత్రి నత్తం విశ్వనాథన్ ఒక మెగావాట్ విద్యుత్‌కు రూ.35 లక్షల నుంచి రూ.40లక్షల వరకు లంచం పుచ్చుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఇలా అనేక విద్యుత్ సంస్థల నుంచి మంత్రి నత్తం రూ.525 కోట్లు లంచం పుచ్చుకున్నారని ఆయన ఆరోపించారు .
మంత్రి నత్తం అవినీతి కార్యకలాపాలపై గత నెల ఒకటో తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినా విచారణ ప్రారంభించలేదని కోర్టుకు తెలిపారు. అందువల్ల కోర్టుకు సమర్పించిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించి ఏసీబీకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిటిషన్ పై జూన్ రెండో వారంలోగా విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమర్పించాల్సిందిగా న్యాయమూర్తి పి.దేవదాస్ ఏసీబీ అధికారులను ఆదేశించారు.