సాక్షి, హైదరాబాద్: రోజంతా శ్రమిస్తే గానీ రూ.500 సంపాదించడం కష్టమవుతున్న ఈ రోజుల్లో, టీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రులు ఓ పది నిమిషాలు ఐస్ క్రీములు, టీ అమ్మి, మూటలు మోసి లక్షల రూపాయలు సంపాదించారని హైకోర్టుకు సీనియర్ న్యాయవాది సి.వి. మోహన్‌రెడ్డి నివేదించారు. ఇది నిజమే అయితే ప్రజలంతా కూలీ పని తప్ప, మరో పని చేయరన్నారు. మంత్రులుగా ఉండి.. గులాబీ కూలీ పేరుతో డబ్బు వసూలు చేయడం అవినీతి కిందకు వస్తుందన్నారు. దీనిపై పిటిషనర్ రేవంత్‌రెడ్డి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తే, వారు కనీస దర్యాప్తు కూడా చేయలేదన్నారు.
ఈ వాదనలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్‌కుమార్ తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి మొదలు పలువురు మంత్రులపై రేవంత్‌రెడ్డి ఈ పిటిషన్‌లో తీవ్ర ఆరోపణలు చేశారని, అయితే వారిని ప్రతివాదులుగా చేర్చలేదన్నారు. అందువల్ల ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, కొంత గడువునివ్వాలని ఆయన కోర్టును కోరారు. ఇందుకు కోర్టు నాలుగు వారాల గడువునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘గులాబీ కూలీ’పై దర్యాప్తు చేసేలా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కొడంగల్ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి విచారణ జరిపారు.
ఈ సందర్భంగా మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఏ కోణంలో చూసినా గులాబీ కూలీ విచారణకు స్వీకరించదగ్గ నేరం (కాగ్నిజబుల్ అఫెన్స్) కిందకు వస్తుందన్నారు. అయితే ఏసీబీ అధికారులు మాత్రం దర్యాప్తు అవసరం లేదంటున్నారని తెలిపారు. అందువల్ల సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. శరత్ వాదనలు వినిపిస్తూ, రేవంత్ ఆరోపణలకు ఆధారాలు లేవని ఏసీబీ అధికారులు భావించారు కాబట్టే, అతని ఫిర్యాదును వారు మూసివేశారన్నారు.
‘గులాబీ కూలీ’ దర్యాప్తును సీబీఐకి ఇవ్వండి
Published Wed, Jun 6 2018 1:32 AM | Last Updated on Fri, Aug 31 2018 8:57 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment