‘రహేజా’ కేసు కొట్టివేత
పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఊరట
సాక్షి, హైదరాబాద్: రహేజా భూవివాదంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన అభియోగాల్ని హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకర్‌రావు 129 పేజీలతో కూడిన కీలక తీర్పును మంగళవారం వెలువరించారు. ఈ తీర్పుతో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఊరట లభించింది. రహేజా ప్రాజెక్టులో ఏపీఐఐసీ వాటాను 11 శాతం నుంచి 0.55 శాతానికి తగ్గించడం వల్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని న్యాయవాది టి.శ్రీరంగారావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరపాలని ఏసీబీని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు విచారణ చేసిన ఏసీబీ... కేసును మూసివేయాలని సిఫార్సు చేసింది.
ఆ సిఫార్సు అమల్లోకి వచ్చింది. ఇందుకు అభ్యంతరం తెలుపుతూ న్యాయవాది శ్రీరంగారావు పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఏసీబీ కోర్టు కేసు నమోదు చేసి నిందితులకు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు అందుకున్న వారిలో ఏపీఐఐసీ వైస్‌చైర్మన్, ఎండీలుగా చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం, బీపీ ఆచార్య, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి/ ప్రత్యేక కార్యదర్శిగా చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కె.రత్నప్రభ, ఎం.గోపీకృష్ణ, ఐటీ శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా చేసి రిటైర్ అయిన పీఎస్ మూర్తి, రహేజా ఎండీ నీల్ రహేజా, రహేజా మైండ్‌స్పేస్ అధినేత బి.రవీంద్రనాథ్‌లు ఉన్నారు. ఒకసారి మూసేసిన కేసును అదే ఏసీబీ కోర్టు తిరిగి తెరవడంపై వీరంతా అభ్యంతరాన్ని లేవనెత్తారు.
కుట్ర ఆరోపణలకు ఆధారాలు లేవు...
గోపీకృష్ణ, రత్నప్రభ, ఎల్వీ సుబ్రహ్మణ్యం, బీపీ ఆచార్యపై ఉన్న అన్ని ఆరోపణలపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, చట్ట ప్రకారం పీఎస్ మూర్తిపై విచారణకు కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది. అయితే ఏసీబీ కోర్టు ప్రాసిక్యూషన్‌కు అనుమతి పొందలేదంది. అంతే కాకుండా రహేజా, నీల్ రహేజా, రవీంద్రనాథ్‌లతో కలసి అధికారులు కుట్రపన్నారన్న ఆరోపణలకు ఆధారాలు లేవని హైకోర్టు తేల్చింది. ఆ ముగ్గురి నుంచి లబ్ధి పొందారనడం, తప్పులు చేశారన్న ఆరోపణల్లో కూడా నిజం లేదని తన తీర్పులో పేర్కొంది. ఏసీబీ కోర్టు న్యాయవాది పిటిషన్‌ను విచారణకు స్వీకరించి జారీ చేసిన ఆదేశాలు చెల్లవని స్పష్టం చేసింది.